NTV Telugu Site icon

చింతామ‌ణిని ఎలా నిషేధిస్తారు.. స‌ర్కార్‌కు హైకోర్టు ప్ర‌శ్న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చింతామ‌ణి నాటాకాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై భిన్న‌వాధ‌న‌లు వినిపిస్తున్నాయి.. ఈ వ్య‌వ‌హారం కోర్టు మెట్లుఎక్కిన విష‌జ్ఞం తెలిసిందే కాగా.. చింతామణి నాటకం నిషేధంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఒక పాత్ర బాగోకపోతే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణ‌యంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై విచార‌ణ స్పంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.. నాటకంలో ఒక పాత్ర బాగోకపోతే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించనప్పుడు.. నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారని ఆక్షేపించింది.

ఇక, విచార‌ణ సంద‌ర్భంగా ప్రభుత్వానికి వచ్చిన వినతుల ఆధారంగా నాటకాన్ని నిషేధించామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, దీనిపై వచ్చే మంగళవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించి హైకోర్టు.. త‌దుప‌రి విచార‌ణ‌ను కూడా ఆ రోజుకే వాయిదా వేసింది. కాగా, చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ ఈనెల 17న ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో స‌వాల్ చేయ‌గా.. సీఎస్‌, రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని ప్రతివాదులుగా చేర్చారు. దేవదాసి వ్యవస్థపై అవగాహన, వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త కళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారని పిటిషన్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. 1920 నుంచి ఎలాంటి అవరోధం లేకుండా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని గుర్తుచేసిన పిటిష‌న‌ర్.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనన్నారు. ఇక‌, ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూ వేలమంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని.. నాటకాన్ని నిషేధిస్తే వారు రోడ్డునపడతారని పేర్కొన్నారు.