ఏపీలో అన్ని థియేటర్లలో ఆన్‌లైన్ సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారంపై శుక్రవారం నాడు హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయంపై హైకోర్టు స్టే విధించింధి. జీవో నెంబర్ 69ని నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఆన్‌లైన్ టిక్కెట్ల వ్యవహారంపై ప్రభుత్వం జీవో నంబర్ 69 జారీ చేయగా.. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
Read Also:Rupee falls: రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి విలువ..
రాష్ట్రవ్యాప్తంగా సినిమా టిక్కెట్లను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్‌డీసీ) ద్వారా విక్రయించాలంటూ ప్రభుత్వం చేసిన చట్ట సవరణలు, అందుకు అనుబంధంగా జారీచేసిన జీవోలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ బుక్ మై షో, మల్టీప్లెక్స్ థియేటర్ల అసోసియేషన్, విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్లు వేర్వేరుగా అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం నాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సినిమా టిక్కెట్ల వ్యాపారంలో ప్రభుత్వం తమతో పోటీకి దిగుతోందని బుక్ మై షో తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించినట్లు తెలుస్తోంది.
