NTV Telugu Site icon

Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త

Cm Jagan

Cm Jagan

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం కొంతకాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తుండగా.. ప్రొబేషన్ డిక్లరేషన్‌పై సీఎం జగన్ తాజాగా సంతకం చేశారు. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల కానుంది. జిల్లాల కలెక్టర్లు ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేయనున్నారు. జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పేస్కేల్ అమలు కానుంది. లక్షా 17 వేల మంది ఉద్యోగులు కొత్త పేస్కేలు కిందకు రానున్నారు. ఆగస్టు 1న కొత్త జీతాలు అందుకోనున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలివ్వడంతో అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైలుపై సీఎం సంతకం చేయడంతో ఉద్యోగుల నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు డిపార్ట్మెంట్ పరీక్ష పాసయ్యారన్నారు. ఉద్యోగులు పాస్ అవ్వటం లేదన్న కారణంతో ముఖ్యమంత్రి నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని తీసేశారని పేర్కొన్నారు. సుమారు 16 వేల మంది మాత్రమే ఇప్పుడు ప్రొబేషన్ డిక్లరేషన్ కిందకు రాలేదన్నారు. పాత పేస్కేల్ ప్రకారం ఇద్దామన్న ఆర్ధిక శాఖ ప్రతిపాదనను ముఖ్యమంత్రి తిరస్కరించారని తెలిపారు. ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని.. ఎక్కువ ప్రయోజనం చేకూర్చాలని సీఎం జగన్ చెప్పారన్నారు. అందుకే కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేల్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని.. రెండు నెలల లోపు అందరికీ సాధ్యమైనంత వరకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ముఖ్యమంత్రి అన్నారని.. పరీక్ష పాసైన వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ అవుతుందని వెంకట్రామిరెడ్డి చెప్పారు.

Andhra Pradesh: ఏపీలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ