వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయంలో కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు బిగించేపనిలో ఉన్నాయి.. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని నిర్ణయాన్ని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్న ఇంధన శాఖ.. ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసింది. ఇళ్లల్లోని కరెంట్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగ కనెక్షన్లకే కాకుండా.. పరిశ్రమలు, వాణిజ్య, ప్రభుత్వానికి సంబంధించి ఉన్న విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని డిసైడ్ అయింది. ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు చర్యలను ఒకే విడతలో కాకుండా.. రెండు విడతల్లో దీన్ని పూర్తి చేసేలా సర్కార్ చర్యలు చేపడుతోంది.
Read Also:Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్ పాదయాత్రలో స్వల్ప మార్పులు.. ఫైనల్ రూట్ ఇదే..
అయితే గృహ వినియోగానికి సంబంధించినంత వరకు అన్ని కనెక్షన్లకు కాకుండా.. 200 యూనిట్ల విద్యుత్ వినియోగం దాటే మీటర్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లను బిగించాలని నిర్ణయించుకుంది జగన్ సర్కార్. ఈ క్రమంలో మొత్తంగా ఉన్న 18.73 లక్షల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించుకునేందుకు ఆర్‌డీఎస్‌ఎస్ స్కీమ్ కింద అనుమతి లభించింది. వీటిని రెండు విడతల్లో స్మార్ట్ మీటర్లు బిగించుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న పరిస్థితి కన్పిస్తోంది. తొలి విడతలో 4.70 లక్షల మీటర్లకు.. రెండో విడతలో సుమారుగా 14 లక్షలకు పైగా స్మార్ట్ మీటర్లను బిగించనుంది ఇంధన శాఖ. ఇక, పరిశ్రమలు.. వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాల్లోని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించనుంది. వాణిజ్యపరమైన విద్యుత్ కనెక్షన్ల విషయానికొస్తే.. మొత్తంగా 15.48 లక్షలు కనెక్షన్లుంటే.. వాటిల్లో తొలి విడతలోనే ఏకంగా 15.47 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించి..
ఇక, రెండో విడతలో కేవలం 1200 మీటర్లను బిగించనున్నారు. అలాగే పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన విద్యుత్ కనెక్షన్లకు తొలి విడతలోనే స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను పూర్తి కానిచ్చేనున్నాయి డిస్కంలు. పరిశ్రమలకు సంబంధించి 1.19 లక్షల కనెక్షన్లు.. ప్రభుత్వ కార్యాలయాలకు 3.22 లక్షల కనెక్షన్లను ఒకేసారి బిగించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను డిస్కంలు ఏపీఈఆర్సీకి పంపాయి. ఈ నెలాఖరులోగా జుడిషీయల్ ప్రివ్యూ నుంచి క్లారిటీ రాగానే.. టెండర్ల ఖరారుకు సంబంధించి స్పష్టత రానుంది. బహుశా ఈ నెలాఖరు లేదా.. వచ్చే నెల నుంచి స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
