Site icon NTV Telugu

Fishing Ban: మత్స్యకారులు అలర్ట్.. 61 రోజుల పాటు చేపల వేట నిషేధం..

Fishing Ban

Fishing Ban

Fishing Ban: సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేట 61 రోజులపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు అనగా మెకనైజ్డ్ మరియు మోటారు బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు.. అంటే మొత్తం 61 రోజుల పాటు చేపల వేటను నిషేధించామని.. ఈ మేరకు 6వ తేదీన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు.

Read Also: Manju Warrier: లేడీ మహేష్ బాబు.. మీరసలు అన్నం తింటున్నారా.. అందం తింటున్నారా..?

అయితే, ఈ 61 రోజుల పాటు చేపల వేటపై ఎందుకు నిషేధం విధించారనే విషయంపై క్లారిటీ ఇస్తూ.. సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వివిధ చేప రొయ్య జాతుల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలను రొయ్యలను సంరక్షించడం ద్వారా వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం తద్వారా సముద్ర మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేయడమేనని పేర్కొన్నారు.. ఈ నిషేధ ఉత్తర్వులను అనుసరించి సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు (మెకనైజ్డ్ మరియు మోటారు బోట్లు) పై మత్స్య కారులు ఎటువంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాలని కోరారు.. ఒకవేళ ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా చేపల వేట చేస్తే.. ఆయా బోట్ల యజమానులు ఏపీ సముద్ర మత్స్య క్రమబద్దీకరణ చట్టం 1994, సెక్షన్ (4)ను అనుసరించి శిక్షార్హులు అని స్పష్టం చేశారు. అట్టివారి బోట్లను, బోటులో ఉండే మత్స్య సంపదను స్వాధీన పరచుకోవడమే కాకుండా జరిమానా విధిస్తూ ప్రభుత్వం అందించే అన్ని రకాల రాయితీలను, సౌకర్యాలను నిలుపుదల చేయబడునని మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు వార్నింగ్‌ ఇచ్చారు.. ప్రభుత్వం ప్రకటించిన 61 రోజుల నిషిద్ధ కాలం ఖచ్చితంగా అమలు చేయుటకై మత్స్య శాఖ, పోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నావీ మరియు రెవిన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేశామని.. మత్స్య కారులందరూ సహకరించాలని మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Exit mobile version