Global Horticulture Hub : రాయలసీమ ప్రాంతపు రాతను మార్చి, ఉద్యాన రైతులకు విత్తనం వేసే దశ నుంచి విదేశాలకు పంటలను ఎగుమతి చేసే వరకు కొండంత అండగా నిలిచే ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం అంకురార్పణ చేయనుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని ఈ బృహత్తర అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించనున్నారు. మూడు దశల్లో రూ.1 లక్ష కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వ ‘పూర్వోదయ’ పథకం ద్వారా రూ.40,352 కోట్ల నిధులను సమకూరుస్తుండగా, ప్రైవేట్ రంగం నుంచి రూ.60,000 కోట్ల పెట్టుబడులను రాబట్టేలా కూటమి ప్రభుత్వం బృహత్తర ప్రణాళిక రూపొందించింది.
10 జిల్లాలు.. 201 క్లస్టర్లు.. ఫ్రూట్ బౌల్‌గా ఆంధ్రప్రదేశ్
రాయలసీమ రైజింగ్‌లో భాగంగా ఉద్యాన వెలుగులు నింపేలా ప్రారంభమవుతున్న ఈ హబ్ పరిధిలోకి అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలు కూడా రానున్నాయి. మొత్తం 10 జిల్లాల్లోని 303 మండలాలు, 5,869 గ్రామాల్లో 201 క్లస్టర్లుగా వర్గీకరించి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే దేశంలో ‘రైస్ బౌల్’ గా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ను, ఈ ప్రాజెక్టు ద్వారా ‘ఫ్రూట్ బౌల్’ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం 8.41 లక్షల హెక్టార్లలో ఉన్న హార్టికల్చర్ సాగును మరో 6 లక్షల హెక్టార్లకు విస్తరించి మొత్తం 14.41 లక్షల హెక్టార్లకు పెంచనున్నారు. అలాగే 222 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న వార్షిక ఉద్యాన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏకంగా 435 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకెళ్లాలని ప్రభుత్వం టార్గెట్ ఫిక్స్ చేసుకుంది.
రూ.40,352 కోట్ల ప్రభుత్వ నిధులు.. మౌలిక సదుపాయాల విస్తరణ
రాయలసీమ హార్టికల్చర్ హబ్ పనుల్లో భాగంగా భారీ ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధి, డ్రిప్ ఇరిగేషన్, కనెక్టివిటీ రహదారులు, లాజిస్టిక్స్ రంగాన్ని వేగవంతంగా విస్తరించనున్నారు. ప్రభుత్వం వెచ్చించే రూ.40,352 కోట్ల నిధుల్లో ఒక్క నీటిపారుదల రంగానికే రూ.20,884 కోట్లు కేటాయించగా, ఉద్యాన రంగాభివృద్ధికి రూ.15,000 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.4,562 కోట్లను ఖర్చు చేయనున్నారు. కొత్తగా 9 లక్షల ఎకరాలకు ఆయకట్టు సౌకర్యాన్ని కల్పించడంతో పాటు, 4.3 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే చర్యలు చేపట్టనున్నారు. దీనివల్ల సుమారు 9.6 లక్షల మంది ఉద్యాన రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. మామిడి, అరటి, టమోటా, దానిమ్మతో పాటు డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, బెర్రీస్ వంటి అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగును ప్రోత్సహిస్తూ, ఆయా ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించనున్నారు.
ఆరు నెలల శ్రమ.. కేంద్రంతో సుదీర్ఘ సంప్రదింపులు
ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రూపుదిద్దుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఆరు నెలలుగా సుదీర్ఘమైన కసరత్తు చేశారు. వ్యవసాయ, ఉద్యాన, ఆర్థిక, నీటిపారుదల తదితర కీలక శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపి ‘పూర్వోదయ’ పథకం కింద భారీగా నిధులను సాధించడంలో విజయం సాధించారు. రేపు ఉదయం మదనపల్లె వేదికగా ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు, రాయలసీమ ప్రాంత సాగునీటి, ఉద్యాన రంగాల రూపురేఖలను శాశ్వతంగా మార్చివేసి రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

