Site icon NTV Telugu

Andhra Pradesh: వాట్సాప్‌తో చేతులు కలిపిన ఏపీ డిజిటల్ కార్పొరేషన్

Apdc

Apdc

ఏపీ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (ఏపీడీసీ) ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం ఏపీడీసీ వాట్సాప్‌తో ఒప్పందం చేసుకుంది. ఏపీలో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వేదిక అవసరాన్ని, ప్రాముఖ్యతను గుర్తించి వాట్సాప్ ఇండియా ఏపీడీసీ వాట్సాప్ వేదికకు పూర్తి సాంకేతిక మద్దతు అందిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, నిర్ణయాలకు సంబంధించిన సమాచారం రాష్ట్రంలోకి ప్రతి ఒక్కరికీ మరింత వేగంగా అందనుంది.

ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, చేపట్టే సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతో పాటు ఈ విషయాలపై తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కూడా ఈ వాట్సాప్ సేవలు మరింత ఉపయోగపడతాయని ఏపీడీసీ భావిస్తోంది. ఈ సేవల విస్తరణలో భాగంగా త్వరలో పూర్తిస్థాయి వాట్సాప్ చాట్‌బోట్ సేవలను కూడా ఏపీడీసీ అందించనుంది. ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల సమాచారాన్ని రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరవేయడంలో ఏపీడీసీ ప్రారంభించబోయే ఈ వాట్సాప్, చాట్‌బోట్ సేవలు ఉపయోగపడనున్నాయి.

కాగా ఏపీడీసీ వైస్ ఛైర్మన్, ఎండీ చిన్న వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రగతిశీల అజెండాను రాష్ట్ర ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రఖ్యాత మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య డిజిటల్ మాధ్యమాల ద్వారా వారధిలా ఉండాలన్న ఏపీడీసీ లక్ష్యానికి ఈ ముందడుగు ఎంతో సాయపడుతుందని అభిప్రాయపడ్డారు.

అటు వాట్సాప్ ఇండియా పబ్లిక్ పాలసీ అధిపతి శివనాథ్ ఠుక్రాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇ-గవర్నెన్స్‌ను మరింత మెరుగుపరిచే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తమకు గర్వంగా ఉందన్నారు. వైవిధ్యభరితమైన, ప్రతి అవసరానికి తగిన ఇ-గవర్నెన్స్ పరిష్కారాలు రూపొందించేందుకు వాట్సాప్ వ్యాపార వేదిక ద్వారా నిరంతరం పనిచేస్తామన్నారు. వీటి వల్ల పౌరులతో వేగవంతమైన, సులభతరమైన, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సత్సంబంధాలు నెరిపేందుకు వీలవుతుందన్నారు. తాము రూపొందించిన పరిష్కారాలను దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, నగర పాలక సంస్థలకు అందించి వాటితో కలిసి పనిచేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తామని శివనాథ్ ఠుక్రాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Exit mobile version