ఏపీలో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రుల కమిటీతో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు సమ్మెను విరమించారు. అంతకుముందు ఉద్యోగ సంఘాల నేతలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో సీఎం జగన్ మనసు విప్పి మాట్లాడారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఎవరూ భావోద్వేగాలకు పోవద్దని సీఎం జగన్ కోరారు. తాను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటేనని.. ఉద్యోగులు లేకపోతే తాను లేనని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల మద్దతు ఉంటేనే ఏదైనా చేయగలుగుతామని జగన్ అన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వమని తెలిపారు.
Read Also: ఉద్యోగుల పోరాటం వృథా కాలేదు.. వెంకట్రామిరెడ్డి
ఓ వైపు కరోనా సంక్షోభంతో ఏపీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నా ఉద్యోగులకు చేయగలిగినంత చేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు. పరిస్థితులు బాగుండి ఉంటే ఉద్యోగులను మరింత సంతోషపెట్టేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. కానీ భవిష్యత్తులో ఉద్యోగులకు మరెవ్వరూ చేయనంతగా జగన్ చేశాడు అనిపించుకుంటానని హామీ ఇచ్చారు. శనివారం నాడు మంత్రుల కమిటీ ఉద్యోగుల ముందు ఉంచిన ప్రతి ప్రతిపాదనకు తన సమ్మతి ఉందని జగన్ పేర్కొన్నారు. సీపీఎస్ విషయంలో కూడా ఉద్యోగులకు సరైన పరిష్కారం చూపిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ కీలక అంశంపై ఎలా ముందుకెళ్లాలనేదానిపై నిపుణులతో అధ్యయనం చేస్తున్నామన్నారు. ఆ సమస్య పరిష్కారంలో ఉద్యోగ సంఘాలనూ భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని ఉద్యోగ నేతలతో చెప్పారు.
