NTV Telugu Site icon

BJP vs BJP: ఏపీ బీజేపీలో పదవుల మార్పు కలకలం… నేతల రాజీనామాలు..!

Ap Bjp

Ap Bjp

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో జిల్లాల అధ్యక్ష పదవుల మార్పు కలకలం సృష్టిస్తోంది.. ఇటీవలే ఆరు జిల్లాలకు అధ్యక్షులను మార్చేశారు బీజేపీ ఏపీ చీఫ్‌ సోము వీర్రాజు.. మార్చిన జిల్లాల అధ్యక్షులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పదవులు కట్టబెట్టారు.. అయితే, ఏకపక్షంగా పదవులను మార్చారంటూ పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు నేతలు.. పార్టీ పదవికి రాజీనామా చేశారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శ్రీకాకుళం జిల్లా ఇంఛార్జ్‌ చిగురుపాటి కుమారస్వామి.. కృష్ణా జిల్లాలోని వివిధ విభాగాల పదవులకు రాజీనామాలు చేశారు పలువురు నేతలు. పార్టీ పదవులకు రాజీనామా చేశారు అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట నగేష్‌, రెడ్డి నారాయణరావు.. రాష్ట్ర పార్టీ చీఫ్‌ సోము వీర్రాజు ఒంటెత్తు పోకడల వల్లే పదవులకు రాజీనామాలు చేస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం వాదనగా ఉంది.. మరిన్ని రాజీనామాలు ఉంటాయంటూ ప్రచారం కూడా సాగుతోంది.

Read Also: Mekathoti Sucharitha: సుచరిత వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఇదేనా..?

అయితే, పార్టీ విధానాలను అనుసరించే పదవుల్లో మార్పులు చేర్పులు చేశామని చెబుతోంది ఏపీ బీజేపీ.. జిల్లా అధ్యక్షులుగా ఉన్న వాళ్లకి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం ప్రమోషన్‌ అని చెప్పుకొస్తున్నారు. కన్నా లక్ష్మీ నారాయణను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. జాతీయ కార్యవర్గ సభ్యుడుగా తీసుకున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది సోమువీర్రాజు వర్గం.. ఇప్పుడు రాజీనామా చేశానని చెప్పుకుంటున్న తోట నగేష్‌.. రెండు నెలల క్రితమే పార్టీ పదవికి రాజీనామా చేశారని పార్టీ అధినాయకత్వం అంటోంది. చిగురుపాటి కుమారస్వామి రాజీనామా మినహా.. మిగిలిన వారి రాజీనామాలేవీ పార్టీ అధిష్టానానికి చేరలేదంటున్నారు.. పార్టీ నుంచి వీలైనంత త్వరగా బయటకెళ్లాలనుకునే వారు తెర వెనుక ఉండి.. రాజీనామాల ఎపిసోడ్‌ నడిపిస్తున్నారని సోము వర్గం ఫైర్‌ అవుతోంది.. ఏపీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు ఏపీ బీజేపీ నేతలు..

ఆయా పార్టీల జిల్లాల అధ్యక్షుల పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు చేశామని చెబుతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.. జిల్లా అధ్యక్షులతో.. జోనల్ ఇంఛార్జీల సంప్రదింపులు జరిపాకే మార్పులు జరిగాయని స్పష్టం చేస్తున్నారు.. వేరే ఉద్దేశ్యాలు ఉంటే కన్నా లక్ష్మీనారాయణ మారిన వెంటనే జిల్లా అధ్యక్షులను మార్చేసేవాళ్లం కదా? అంటూ ప్రశ్నలు సందిస్తోంది సోము వీర్రాజు వర్గం.. మారిన జిల్లాల అధ్యక్షులెవరూ పార్టీ పదవులకు రాజీనామా చేయలేదని ఏపీ బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు.. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో బీజేపీ నేతల తీరు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.