AP Panchayat Elections: సర్పంచ్ పదవికి వేలం పాట.. చీటీల పద్ధతిలో ఏకగ్రీవం..! ఎక్కువ మొత్తం రాసిన వ్యక్తికే పదవి!

Nakkalapalli Sarpanch Elect

Nakkalapalli Sarpanch Elect

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు వెలగు చూస్తున్నాయి.. ఓవైపు ఏకగ్రీవమైన పంచాయతీలకు ఇచ్చే నజరానా ను ప్రభుత్వం పెంచగా.. మరోవైపు.. ఏకగ్రీవం కోసం ఎవరి స్టైల్‌లో వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. పంచాయతీ ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలోని ఓ గ్రామం వింత నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. ఎన్నికల ఖర్చులు, రాజకీయ వివాదాలకు తావులేకుండా సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని గ్రామస్తులు నిర్ణయించారు. అయితే గ్రామాభివృద్ధికి ఎవరు ఎక్కువ మొత్తం డబ్బులు ఇస్తారో వారికే సర్పంచ్ పదవి కేటాయించాలనే నిబంధన పెట్టడం ఆసక్తికరంగా మారింది. బెలుగుప్ప మండలం నక్కలపల్లిలో ఈ విధానం మరోసారి అమలైంది.

నక్కలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులను గ్రామస్తులు సమావేశానికి పిలిచారు. గ్రామాభివృద్ధికి తాము ఎంత మొత్తం విరాళంగా ఇస్తామో చీటీల్లో రాసి డబ్బాలో వేయాలని సూచించారు. ఈ విధంగా సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న తొమ్మిది మంది అభ్యర్థులు తాము చెల్లించబోయే మొత్తాలను చీటీల్లో రాసి డబ్బాలో వేశారు. అనంతరం గ్రామస్తులు చీటీలను తెరిచి పరిశీలించగా, సుదర్శనరెడ్డి తన భార్య పేరుతో గ్రామాభివృద్ధికి రూ.25.6 లక్షలు ఇస్తానని రాసినట్లు వెల్లడైంది. తొమ్మిది మందిలో అత్యధిక మొత్తాన్ని ప్రకటించడంతో గ్రామస్తులు ఆయన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీంతో ఆయన భార్య సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

గతంలో రూ.21 లక్షలు.. ఈసారి రూ.25.6 లక్షలు!
నక్కలపల్లిలో ఈ విధానం కొత్తదేమీ కాదు. గత ఎన్నికల్లోనూ ఇదే తరహాలో చీటీల పద్ధతిని అనుసరించారు. అప్పట్లో రామిరెడ్డి రూ.21 లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తానని ప్రకటించడంతో ఆయన సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి గత ఎన్నికల కంటే రూ.2.6 లక్షలు అధికంగా కాకుండా, ఏకంగా రూ.4.6 లక్షలు ఎక్కువగా రూ.25.6 లక్షల మొత్తాన్ని ప్రకటించి సుదర్శనరెడ్డి తన భార్యకు సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకున్నారు. మొత్తానికి ఎన్నికల ఖర్చులు, పోటీలు, వివాదాలకు దూరంగా ఉండేందుకు నక్కలపల్లి గ్రామస్తులు అనుసరిస్తున్న ఈ చీటీల పద్ధతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కువ మొత్తంలో గ్రామాభివృద్ధికి డబ్బులు ఇస్తామని ప్రకటించిన వారికి సర్పంచ్ పదవి దక్కేలా చేసిన ఈ విధానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.