Site icon NTV Telugu

Ex CM Photo Controversy: ఫొటో వివాదం..! జడ్పీ సీఈవోపై వేటు

Jagan Photo Controversy

Jagan Photo Controversy

Ex CM Photo Controversy: అనంతపురం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ ఛాంబర్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో వివాదానికి కారణమైంది… గత సమావేశంలో ఎమ్మెల్యేలు అధికారులు దృష్టికి తీసుకెళ్లిన వారిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో అధికారులపై ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రోజుల క్రితం జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించగా.. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. వారు అటుగా వెళ్తుండగా జడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ ఛాంబర్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటాన్ని గుర్తించారు. అదే సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటో స్టోర్ రూమ్ పక్కన ఉంచడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే జెడ్పీ డిప్యూటీ సీఈవోని పిలిపించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నిబంధన ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఫోటో పెడతారని ప్రశ్నించారు.. జడ్పీ సీఈవో నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం పై ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Read Also: AP Crime: ఏపీలో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, హత్య..!

కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఫొటోలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని కార్యాలయాల్లో కూడా ఫొటోలు పెడుతున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ ఛైర్మన్లుగా, జడ్పీ ఛైర్మన్లుగా గెలిచిన వారంతా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోలు పెట్టుకున్నారు. ప్రభుత్వం మారినా ఛైర్మన్ల ఛాంబర్లలో జగన్ ఫొటోలే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అనంతపురం జడ్పీ ఛైర్ పర్సన్ ఛాంబర్ లో జగన్ ఫొటో ఉండడం వివాదాస్పదంగా మారింది.. మరోవైపు జడ్పీ ఛాంబర్‌లో ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించడంపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకడుగు ముందుకేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ఛాంబర్‌లోకి ఎమ్మెల్యేలు దౌర్జన్యంగా వెళ్లి ఆమె ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో వ్యవహరించారంటూ ఫైర్ అయ్యారు. అసలు ఆమె అనుమతి లేకుండా ఛాంబర్ లోకి ఎలా వెళ్తారంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫొటో కిందపడేసి, ధ్వంసం చేశారని, సీఈవోను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. అయితే ప్రోటోకాల్ వివాదం కాస్త రాజకీయ రగడగా మారడంతో జడ్పీ సీఈవోపై బదిలీ వేటు పడింది.. జిల్లా పరిషత్ సీఈవో రామచంద్రారెడ్డి ను జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Exit mobile version