Site icon NTV Telugu

Liquor Shops: ఎక్సైజ్ శాఖకు ఊహించని షాక్..!

Liquor Shops Closed

Liquor Shops Closed

Liquor Shops: మూడు హాఫ్ లు… ఆరు ఫుల్లులు అనుకుంటే లిక్కర్ సిండికేట్ వ్యాపారం చుక్కలు చూపిస్తోంది. లైసెన్స్ ఫీజులు భారీగా పెంచేసిన సర్కార్.. 20 శాతం మార్జిన్ పై ఇచ్చిన హామీని అమలు చేయడం లేదు. పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కూడా రావని ఆందోళనలో ఉంటే ఇటీవల పర్మిట్ రూమ్ ల పరేషాన్ ఎక్కువైందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇందు కోసం ఏడున్నర లక్షలు చెల్లించాలని ఒత్తిళ్లు ఎక్కువయ్యాయనే ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని లిక్కర్ వ్యాపారులు సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాకపోవడం., పెరుగుతున్న ఒత్తిళ్లను తట్టుకో లేక మూకుమ్మడిగా వైన్ షాపులు మూసి వేయాలని తీర్మానించారు. ఎక్కడి స్టాక్ అక్కడే వదిలేసి మూసి వేసిన షాపుల తాళాలను అనకాపల్లి
లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసులో అప్పగించి నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తున్నామని చెబున్న ప్రభుత్వం… ఖజానాకు ఆదాయం తెచ్చిపెడుతున్న తమకు మాత్రం అన్యాయం చేస్తోందనేది వ్యాపారులు వాదన.

Read Also: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. నేడు ఎంత తగ్గిందంటే..!

వ్యాపారుల నిర్ణయంతో ఎక్సైజ్ అధికారులు ఖంగుతిన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని తాళాలు తిరిగి అందజేశారు. ఈ నెలాఖరు వరకు వేచి చూస్తామని అప్పటికీ సానుకూల నిర్ణయం వెలువడకపోతే శాశ్వతంగా షాపులు మూసి వేస్తామని ప్రకటించారు. 2026 సెప్టెంబరు 30 వరకు అమలులో ఉన్న వ్యాపార కాల వ్యవధితో మద్యం షాపులకు టెండర్లు నిర్వహించింది ఎక్సైజ్ శాఖ. ఏడాది దాటిన తరువాత లైసెన్స్‌ ఫీజు పది శాతం పెరుగుతుంది. జిల్లాలో 136 మద్యం దుకాణాల ఏర్పాటు అయ్యాయి. వీటిలో అనకాపల్లి టౌన్ లో 12, అనకాపల్లి మండలంలో 5, పరవాడలో 11, అచ్యుతాపురంలో 9, మునగపాకలో 4, కశింకోటలో 6, సబ్బవరంలో 8, నర్సీపట్నం మునిసిపాలిటీలో 7, నర్సీపట్నం మండలంలో 3, రోలుగుంటలో 3, కోటవురట్లలో 4, మాకవరపాలెంలో 4, నాతవరంలో 4, గొలుగొండలో 4, ఎలమంచిలి మునిసిపాలిటీలో 4, ఎలమంచిలి మండలంలో 3, రాంబిల్లిలో 4, చోడవరంలో 8, కె.కోటపాడులో 5, దేవరాపల్లిలో 4, బుచ్చెయ్యపేటలో 5, పాయకరావుపేటలో 6, నక్కపల్లిలో 5, ఎస్‌.రాయవరంలో 7, మాడుగులలో 5, చీడికాడలో 3, రావికమతం మండలంలో 5 లిక్కర్ షాపులు ఉన్నాయి.

వీటికి అనుబంధంగా పర్మిట్ రూమ్ లు ఓపెన్ చేయాలని ఒత్తిళ్లు వస్తున్నాయని.. ఏడున్నర లక్షలు కట్టడం అంటే ప్రస్తుతం వున్న భారం రెట్టింపు అవ్వడం తప్ప లాభాలు ఉండవు అనేది వ్యాపారులు వెర్షన్. బార్ పాలసీ అమలు చేయడానికే ఆపసోపాలు పడ్డ అబ్కారీ అధికారులను వైన్ షాప్ నిర్వాహకుల నిరసన మరింత కలవరపాటు కల్గిస్తోంది. ఈ వ్యవహారంపై స్పందించేందుకు అధికారులు ఇష్టపడటం లేదు. పర్మిట్ రూమ్ ల కోసం ఒత్తిళ్లు అనేది ప్రచారం మాత్రమేనని చెప్పుకువస్తున్నారు.

Exit mobile version