NTV Telugu Site icon

Ambati Rambabu: తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవు..!!

Ambati Rambabu

Ambati Rambabu

ఏపీలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ వ్యవహారం వైసీపీని ఇరుకున పెడుతోంది. తాను డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ నేరాన్ని అంగీకరించాడు. దీంతో వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు వైసీపీపై విరుచుకుపడుతున్న తరుణంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన స్పష్టం చేశారు. దావోస్‌లో ఉన్న సీఎం జగన్ కూడా ఎమ్మెల్సీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

MLC Anantha Babu: సుబ్రహ్మణ్యం బ్లాక్‌మెయిల్ చేశాడు.. అందుకే చంపేశా

మరోవైపు టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ ఏం పీకారని అడుగుతున్నాడని.. అలా అనడం తప్పు అని.. ఆయన దగ్గర ఏం ఉందని పీకడానికి అని అంబటి రాంబాబు చురకలంటించారు. లోకేష్‌కు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదని.. అమెరికా వెళ్లి చదువుకున్నాడో లేదా స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో బీర్ తాగుతూ తిరిగాడో తెలియదని ఎద్దేవా చేశారు. లోకేష్ పక్కన తిరిగేవాళ్లే టీడీపీ పనిఅయిపోయిందని అభిప్రాయపడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తన గురించి లోకేష్ పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడని.. తాను తిరిగి మాట్లాడితే ఆయన ఇంటిల్లిపాదీ మీడియా ముందు ఏడుస్తూ కూర్చుంటారని విమర్శించారు. లోకేష్ ఓ మాలోకం అని.. బడుద్దాయి అని.. సంచులు మోసే సన్నాసి అని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాగా జగన్ పనితీరు చూసి ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్‌ను సింగిల్‌గా ఢీ కొట్టలేక టీడీపీ పవన్ కళ్యాణ్, బీజేపీని వెంటతెచ్చుకునే తంటాలు పడుతోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మరోసారి ప్రజలు చిత్తు చేయడం ఖాయమన్నారు. వైసీపీని ప్రజలు మళ్ళీ గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీది ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం కాదని.. జగన్ పాలన చూసి ‘ఏడుపే ఏడుపు’ కార్యక్రమం అని ఆరోపించారు.