Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!

Ambati Rambabu

Ambati Rambabu

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మద్యం అక్రమ రవాణా కేసుకు సంబంధించిన వ్యవహారంలో రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ ఈ సమన్లు పంపారు. గతంలోనే ఈడీ అధికారులు విచారణకు రావాల్సిందిగా ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటికీ, అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్లు అంబటి రాంబాబు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారు.

ఆ తర్వాత తనకు గుండెకు స్టెంట్లు వేసినట్లు ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన వైద్య నివేదికలను కూడా ఈడీ కార్యాలయానికి పంపించారు. ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీన ఈడీ అధికారులు ఈ నెల 4న విచారణకు రావాలని పేర్కొంటూ ఆయనకు అధికారికంగా ఈ-మెయిల్ ద్వారా సమన్లు పంపారు. అయితే.. ఆ మెయిల్‌ను తాను సమయానికి చూసుకోలేదని అంబటి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో నిన్న మరోసారి కొత్తగా నోటీసులు జారీ చేసిన ఈడీ బృందం, రేపు కచ్చితంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అధికారుల ఆదేశాల మేరకు రేపు ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.