Site icon NTV Telugu

CM Chandrababu : సీఆర్డీఏ కీలక నిర్ణయాలు

Chandrababu Naidu

Chandrababu Naidu

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 56వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని పనుల పురోగతి, కొత్త టెండర్లు, భూ కేటాయింపులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా మార్చే దిశగా, రాజధానిలో ‘క్వాంటం కంప్యూటింగ్ సెంటర్’ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచే అంశంపై అథారిటీ సుదీర్ఘంగా చర్చించింది. వీటితో పాటు రాజధానిలో నివసించే అఖిల భారత సర్వీసు అధికారులు (IAS, IPS), అలాగే గౌరవ న్యాయమూర్తుల నివాసాల వద్ద చేపట్టాల్సిన అదనపు నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాజధానిలోని జోన్-8లో ఎల్పీఎస్ (LPS) పనులతో పాటు, వర్షపు నీటి నిర్వహణకు కీలకమైన పంపింగ్ స్టేషన్ల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. అలాగే, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న యోగా , నేచురోపతి సెంటర్ నిర్మాణానికి సంబంధించి మంత్రుల ఉపసంఘం తీసుకున్న భూ కేటాయింపు నిర్ణయాలను సీఎం సమీక్షించారు. ఏపీసీఆర్డీఏ , అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ADCL) పాలనా వ్యయాలకు సంబంధించిన మంజూరుపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

రాజధాని ప్రాంత రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. జరీబు , మెట్ట భూముల వర్గీకరణపై నెలకొన్న సందిగ్ధతను తొలగించడానికి ఒక రాష్ట్ర స్థాయి కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా భూముల వర్గీకరణపై స్పష్టత రానుంది.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) విజయానంద్, సీఆర్డీఏ , ఏడీసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరావతిని కేవలం పరిపాలనా నగరంలానే కాకుండా, ఆర్థిక , సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనులు ముమ్మరం చేసింది.

Exit mobile version