Annadata Poru: యూరియా కొరతకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అన్నదాత పోరు నిరసన కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యిందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో పాటు ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వైసీపీ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతులు, రైతు సంఘాలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలకు ర్యాలీలకు అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆందోళనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా పలువురు వైసీపీ ముఖ్య నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొందరిని అరెస్టు చేశారు. గత నాలుగు నెలలకుపైగా రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెనాయుడు పట్టించుకోలేదని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలమనేరు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. రైతులతో కలిసి ముందుకు నడిచారు. నగరిలో ఆర్కే రోజా, కాళహస్తిలో భూమన కరుణాకరరెడ్డి ఆందోళనల్లో పాల్గొన్నారు. యూరియా కొరత తీర్చేంత వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదనీ, ఎన్ని ఆంక్షలు, ఆటంకాలు సృష్టించినా ఎక్కడా వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
Read Also: Off The Record: పోసానికి క్షవరం అయ్యాకగాని వివరం తెలిసి రాలేదా?
ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లోనూ రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్టీయార్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా పార్టీ నేతలంతా పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ను అడ్డుకున్నారు పోలీసులు. ఉయ్యూరులో మాజీ మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. చేతగాని ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతోందనీ, అసలు చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు రైతులపై ఎందుకంత వివక్ష అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. విశాఖలో వర్షం కురిసినా నిరసనల్లో పాల్గొన్నారు. యూరియా, ఎరువులు అందుబాటులో ఉంచడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి వైసిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.
Read Also: Waze App: ట్రాఫిక్ చలాన్ నుంచి తప్పించుకోవాలా? ఈ ఒక్క యాప్ఇ న్‌స్టాల్ చేసుకోండి..
అన్నదాత పోరు సక్సెస్ అయిందని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 74 ప్రాంతాల్లో చేసిన నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించిందన్నారు. 15 నెలుగా రాష్ట్రంలో ఏ పంట సాగు చేసిన రైతయినా ప్రశాంతంగా ఉన్నాడా అని అప్పిరెడ్డి ప్రశ్నించారు. గంటల తరపడి యూరియా కోసం నిత్యం క్యూలో నిలపడుతున్నా చంద్రబాబుకు కనపడటం లేదన్నారు. వైసీపీ నిరసనల ప్రకటన తర్వాతనే చంద్రబాబు హడావుడి చేస్తున్నారన్నారు. యూరియాని టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్‌కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు ధర్మాన, రామసుబ్బారెడ్డి, జోగి రమేష్, జక్కంపూడి రాజా, పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి లాంటి అనేకమంది నేతలను హౌస్ అరెస్టు చేశారన్నారు. పోలీసు ఆంక్షలు, గృహ నిర్బంధాల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు విజయవంతం అయ్యింది. రైతులు కన్నీరు పెడితే అనేక ప్రభుత్వాలు కూలి పోయాయని… కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని వైసీపీ నాయకులు హెచ్చరించారు.
