Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్‌..

Janasena

Janasena

Jana Sena Party: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి.. ఇవాళ జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చేరారు. బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యా్‌ణ్‌ సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

జనసేనలో చేరిన వారిలో వైసీపీ నాయకుడు, శ్రీకాకుళం మాజీ డీసీసీబీ చైర్మన్ డోలా జగన్, తిరుపతికి చెందిన పెనుమాదు ప్రణీత్, ఆచంటకు చెందిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకుడు తుంగ నాగేశ్వరరావు ఉన్నారు. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ఏడీఎస్ ప్రసాద్, మారుతి, దోవరీ అమర్నాథ్ కూడా జనసేన పార్టీలో చేరారు. పార్టీలోకి కొత్తగా చేరిన వారిని ఆహ్వానించిన అనంతరం పవన్ కల్యాణ్‌ వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జనసేన పార్టీ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేయాలని సూచించారు.

వివిధ రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన నాయకులు, ప్రముఖులు జనసేనలో చేరడంతో పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంపై పవన్ కల్యాణ్‌ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కూడా ఈ రోజు జనసేనలో చేరారు.. పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు పవన్‌.. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన వంగవీటి రాధాకృష్ణని పవన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు వెళదామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు.