YSR Congress Party: మెడికల్ కాలేజీల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతోంది.. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడ్‌లో అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుందడగా.. పీపీపీ మోడ్ అంటే.. మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు.. ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. ఈ తరుణంలో.. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఇవాళ వైసీపీ ఆద్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూతన మెడికల్ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది వైసీపీ.. తమ ప్రభుత్వ హయాం 2019-24 మధ్యలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.. ఐదు కళాశాలల నిర్మాణం పూర్తి అయ్యి తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి.. మరో రెండు మెడికల్ కళాశాలలు సిద్ధం అయ్యాయి.. వివిధ దశల్లో నిర్మాణం జరుగుతున్న మెడికల్ కళాశాలలను పీపీపీ మోడ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహకాలు జరుగుతుండగా.. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చలో మెడికల్ కాలేజ్ పేరుతో నిరసన కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది వైసీపీ..
Read Also: Sangareddy: గంజాయి మత్తులో ఖైదీల వీరంగం.. భయాందోళనలో జైలు సిబ్బంది
ఛలో మెడికల్ కాలేజీల ఆందోళన కార్యక్రమాల్లో ఎక్కడిక్కడ పార్టీ ముఖ్య నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొననున్నారు.. అయితే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న నేపథ్యంలో వైసీపీ నిరసనలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు.. ఇక, ఓవైపు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలకు పిలుపు ఇవ్వటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు.. ఎక్కడిక్కడ పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలను హౌస్ రెస్ట్ చేస్తున్నారు పోలీసులు..
