NTV Telugu Site icon

YS Jagan Donation For Flood Victims: వరద బాధితులకు రూ.కోటి సాయం ప్రకటించిన వైఎస్‌ జగన్‌..

Jagan

Jagan

YS Jagan Donation For Flood Victims: ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. ముఖ్యంగా విజయవాడ ఈ పరిస్థితి నుంచి ఇప్పటికీ కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు.. అయితే, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. వారికి అందుతున్న సాయంపై ఆరా తీసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు.. పార్టీ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్.. కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు జగన్.. అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్‌ నాయకులు, ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ నాయకులతో ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని, లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో పలువురు నాయకులు.. జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవంగా ఎలాంటి చర్యలు అక్కడ లేవని వారు తెలిపారు. వరద ప్రాంతాల్లో షో చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారని విమర్శించారు..

Read Also: Crime News: ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్

మరోవైపు అధికార యంత్రాంగమంతా సీఎం చంద్రబాబుతో ఉంటూ.. ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు.. దీంతో వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా, వారికి మందులు కూడా లభించడం లేదని, చివరకు పాలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.. ఇక, తన పర్యటనలో వరద బాధితుల పడుతున్న కష్టాలను స్వయంగా చూశానన్న వైఎస్‌ జగన్.. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఘోర తప్పిదం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని, అయినా నింద తమపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.. వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, అది ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు వైఎస్ జగన్‌.. ఇక, ఈ సమావేశంలో.. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, మెరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నబాబు, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, విజయవాడ మేయర్‌ భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ అడపా శేషు తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.