Site icon NTV Telugu

YS Jagan Padayatra 2.0: వైఎస్‌ జగన్ పాదయాత్ర 2.0 ఎలా ఉండబోతోంది..?

Ys Jagan Padayatra 2.0

Ys Jagan Padayatra 2.0

YS Jagan Padayatra 2.0: 2017లో ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేసి 2019లో 151 సీట్లతో అధికారం సాధించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌. 2027లో పాద‌యాత్ర 2.0 కూడా వైసీపీకి పునరుజ్జీవన శక్తిగా మారనుందని నేతలు విశ్వసిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని 2027 జ‌గ‌న్ పాద‌యాత్ర 2.0 ఉంటుంద‌ని తాజాగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అనూహ్యంగా 2024 ఎన్నిక‌ల్లో కేవ‌లం 11 సీట్లకు పరిమితమై భారీ ప‌రాజ‌యం మూటగట్టుకున్నారు. ఇప్పట్లో వైసీపీ కోలుకుంటుందా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు జగన్. ఓవైపు పార్టీ అధికారం కోల్పోవటం, కీలక నేతలు పార్టీని వీడటం, ముఖ్య నేతలపై వరుస కేసులు, అరెస్టులు.. జైళ్ల పరంపర కొనసాగుతున్నా జగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. ఓవైపు రైతులకు పరామర్శలు, మ‌రోవైపు మెడిక‌ల్ కాలేజీల PPPపై ఉద్యమం సాగిస్తున్నారు. పార్టీని రూట్ లెవ‌ల్ నుంచి రీబిల్డ్ చేస్తున్న జగన్‌… బూత్‌ క‌మిటీల నుంచి పీఏసీల వ‌ర‌కూ కొత్తరక్తం ఎక్కించారు.

Read Also:Chikiri Chikiri: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే!

ఇక, 2027లో పార్టీ ప్లీనరీ ఉంటుందని.. ఆ తర్వాత వైఎస్‌ జ‌గ‌న్ పాదయాత్ర 2.0 ఉంటుందని పార్టీ కీల‌క నేత‌లు ప్రకటన‌లు చేస్తూ వ‌స్తున్నారు. దీంతో ఈసారి జగన్ పాదయాత్ర ఎలా ఉండబోతోంది..? ఎక్కడ్నుంచి మొదలవుతుంది..? రూట్ మ్యాప్ ఎలా ఉంటుందన్న పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు పాదయాత్ర ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారంలోకి రావటానికి సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. గతంలో వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్, లోకేష్‌లు పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చారు. పాదయాత్ర 2.0 ద్వారా 2029 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేయాల‌ని జగన్ భావిస్తున్నారు. 2017 నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టారు జగన్‌. 2019 జనవరి 10న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించారు. 341 రోజులు, 3,648 కిలోమీటర్లకుపైగా ఆ యాత్ర సాగింది. 13 జిల్లాలు, 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండ‌లాలు, 2,516 గ్రామాలను కవర్ చేస్తూ ప్రజాసంకల్ప యాత్రను పూర్తి చేశారు జగన్. 55 ఆత్మీయ స‌మ్మేళ‌నాలు, 124 బహిరంగ సభల్లో ప్రసంగించారు.

ఈసారి ముందు జిల్లాల పర్యటనలు చేసి.. ఆ తర్వాత అన్ని జిల్లాలు క‌వ‌ర్ అయ్యేలా పాదయాత్ర 2.0 చేస్తారని తెలుస్తోంది. దాదాపు 5 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అప్పటి సమాయాన్ని బట్టి రోజులు.. కిలోమీటర్లలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ నుంచే పాదయాత్ర మొదలు పెట్టే అవ‌కాశాలున్నాయి. 2019 ఎన్నికలకు ముందు నవరత్నాలు వంటి బలమైన పార్టీ మ్యానిఫెస్టో సిద్ధం చేసిన జ‌గ‌న్ పాద‌యాత్ర 2.0లో అంత‌కు మించి అన్నట్టుగా మ్యానిఫెస్టోను కూడా సిద్దం చేసే అవ‌కాశం ఉంది. 2029 ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మళ్లీ పాత ఫార్ములానే నమ్ముకున్నారా..? అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సిద్దమ‌వుతున్నారా..? గతంలో 2017లో ప్రజా సంకల్ప యాత్రతో పేరుతో పాదయాత్రతో అధికారంలోకి వ‌చ్చిన జగన్… పాదయాత్ర 2.0లో మరోసారి అధికారంలోకి వ‌స్తారా..? జగన్ పాదయాత్ర 2.0 ఎలా ఉండబోతుంది..? ఎప్పుడు మొదలవుతుంది..? రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది..? అనే ఆసక్తి నెలకొంది.

Exit mobile version