YS Jagan on AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఎవరి వాదన వారిదిగా ఉంది.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తానంటూ వైఎస్ జగన్ ప్రకటించగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించడమే కాదు.. కొత్త అవసరాలకు అనుగుణంగా మళ్లీ భూసమీకరణ చేపట్టింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అనే పదానికి రాజ్యాంగంలో ప్రత్యేక నిర్వచనం లేదని, భారత రాజ్యాంగంలో ‘రాజధాని’ అనే పదం ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు. “ప్రభుత్వం ఎక్కడి నుంచి పని చేస్తే.. అదే ఆ రాష్ట్ర రాజధాని” అని పేర్కొన్న జగన్.. శాసనసభ, మంత్రులు, అధికారులు అందరూ అక్కడి నుంచే పాలన సాగిస్తారని, పాలనా వ్యవస్థ మొత్తం అక్కడి నుంచే నడుస్తుందన్నదే రాజధాని అసలైన అర్థం అని వివరించారు.
అసలు, నదీ పరివాహకంలో రాజధాని నిర్మాణం సరికాదు అన్నారు వైఎస్ జగన్.. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. నదీ పరివాహక (River Basin) ప్రాంతంలో రాజధాని నగరం నిర్మించాలనుకోవడం సరికాదని, రివర్ బేసిన్‌లో భవనం కట్టడానికే సాధారణంగా అనుమతి ఉండదని, అలాంటి ప్రాంతంలో మొత్తం నగర నిర్మాణం చేపట్టాలనుకోవడం ప్రమాదకరమైన, అవివేకమైన నిర్ణయం అని విమర్శించారు వైఎస్ జగన్.
అమరావతి అనువైన ప్రదేశం కాదు
అమరావతి భౌగోళికంగా, మౌలికంగా రాజధానికి అనువైన ప్రాంతం కాదని అన్నారు వైఎస్ జగన్.. విజయవాడ, గుంటూరు నగరాలకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉందని, విద్యుత్, నీరు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు లేని ప్రాంతమని, రోడ్లు, పవర్, వాటర్ కనీస అవసరాలే లేని చోట రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం..? అని ప్రశ్నించారు. ఇక, “రివర్ బేసిన్‌లో భవనాల నిర్మాణానికే అనుమతులు ఉండవు.. అలాంటిది నగరం నిర్మిస్తామనడం సరికాదు” అంటూ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టంగా వెల్లడించారు. రాష్ట్ర ప్రజల సౌకర్యం, భద్రత, అభివృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్ణయం ఉండాలని, పాలనా కేంద్రం ఎక్కడి నుంచి సమర్థంగా పనిచేస్తుందో అదే రాజధానిగా గుర్తించబడుతుందని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..