AP Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో, ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని స్పష్టమైన అల్పపీడనం (వెల్ మార్క్డ్ లో ప్రెజర్) కేంద్రీకృతమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.. ఇక, దీనికి తోడు కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారనున్నాయని పేర్కొన్నారు.
వీటి ప్రభావంతో శుక్రవారం (జూలై 17, 2026) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం నెలకొనడంతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ప్రఖర్ జైన్.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.
అదేవిధంగా ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా భారీ హోర్డింగ్‌ల వద్ద నిలబడవద్దని హెచ్చరించారు. వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడి ఉండే అవకాశం ఉన్నందున అలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని, వాతావరణ శాఖ మరియు విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసే తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు..

