CII Partnership Summit: విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలిరోజే భారీ పెట్టుబడులతో కళకళలాడింది. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో సదస్సు ప్రాంగణంలో పెట్టుబడుల పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, కియా ఇండియా, గ్రీన్కో ఎనర్జీస్, మేఘా ఇంజినీరింగ్ వంటి ప్రముఖ సంస్థలు భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. తొలిరోజు మొత్తం 88 పెట్టుబడి ప్రతిపాదనలు రాగా, 73 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి రూ.5,84,355 కోట్ల పెట్టుబడులు రానుండగా, 1,07,683 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం 15 జీవోలను కూడా జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు.
రిలయన్స్ నుంచి రూ.2.73 లక్షల కోట్ల పెట్టుబడి
ఈ సదస్సులో అత్యంత భారీ పెట్టుబడి ప్రతిపాదనతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. జనరల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో రూ.2,73,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంస్థ అంగీకరించింది. ఈ భారీ ప్రాజెక్టును తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనుంది. జనరల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో అత్యధికంగా 23 ఎంఓయూలు కుదిరాయి. వీటి ద్వారా రూ.3,57,386 కోట్ల పెట్టుబడులు రానుండగా, 44,838 మందికి ఉపాధి లభించనుంది. ఈ రంగంలో రష్మి మెటలర్జికల్ ఇండస్ట్రీస్ రూ.18,500 కోట్లు, జేఎస్డబ్ల్యూ రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ ఒప్పందాలు
రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ఏడు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రూ.1,65,020 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానుండగా, 16,600 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. ఈ రంగంలో గ్రీన్కో ఎనర్జీస్ రూ.45,000 కోట్లు, క్లీన్మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ రూ.41,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి. అలాగే కృష్ణా జిల్లాలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా రూ.36,000 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టును చేపట్టనుంది.
కెమికల్స్ రంగంలో రూ.19,995 కోట్ల పెట్టుబడులు
కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగంలో ఆరు ఎంఓయూలు కుదిరాయి. వీటి ద్వారా రూ.19,995 కోట్ల పెట్టుబడులు రానుండగా, 3,127 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. గెయిల్ ఇండియా శ్రీకాకుళం జిల్లాలో రూ.13,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఎన్ఏఎన్ మ్యాగ్నాటెక్ నెల్లూరులో రూ.3,000 కోట్లతో, ఎన్ఏఎన్ సైలాక్స్ గ్రీన్మెట్ తిరుపతిలో రూ.1,800 కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నాయి.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ కొత్త అవకాశాలు
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఐదు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రూ.4,770 కోట్ల పెట్టుబడులు రానుండగా, 2,847 మందికి ఉపాధి లభించనుంది. ఎస్ఎల్ఎన్ కాఫీ సంస్థ నెల్లూరులో రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్ రూ.1,127 కోట్లు, శ్రీ వసుధ ఫుడ్స్ అనంతపురం జిల్లాలో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
దిగ్గజ కంపెనీలతో ఏపీకి పెట్టుబడుల కళ
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రముఖ పారిశ్రామిక సంస్థల నుంచి భారీ స్పందన లభించింది. తొలిరోజే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడం ప్రభుత్వ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విశాఖలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రిలయన్స్, గెయిల్, సెయింట్ గోబెయిన్, ఎల్ అండ్ టీ, గ్రీన్కో ఎనర్జీస్ సంస్థలతో పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. క్లీన్ ఎనర్జీస్ సొల్యూషన్, హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్, కెల్లాగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ పరిశ్రమల కార్యకలాపాలను ప్రారంభించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో కాపీలను సంస్థ ప్రతినిధులకు సీఎం అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు శ్రీ పియూష్ గోయల్, శ్రీ కే రామ్మోహన్ నాయుడు, మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్, శ్రీ కొల్లు రవీంద్ర, శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#AndhraPradesh— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 12, 2026

