AP High Court: విజయ డెయిరీ బోర్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విజయ డెయిరీ చైర్మన్ దాసరి బాలవర్ధన్ రావు ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. చైర్మన్‌తో పాటు మరో నలుగురు బోర్డు డైరెక్టర్ల ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కాగా, విజయ డైరీ చైర్మన్ దాసరి బాలవర్ధన్ రావు (గన్నవరం)తో పాటు సాయి (ఘంటసాల), పాలడుగు నాని (గన్నవరం), నాగేశ్వరరావు (నందిగామ), శైలజ (మైలవరం) డైరెక్టర్ల ఎన్నికను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఐదుగురు బోర్డు సభ్యులపై పోటీ చేసిన అభ్యర్థులను డిఫాల్టర్లుగా ప్రకటించడంతో వారి ఎన్నికల చెల్లుబాటుపై వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు పోటీ చేసిన అభ్యర్థులు అనర్హులని ఆదేశాలు జారీ చేసింది.. మరోవైపు, విజయ డెయిరీ బోర్డు ఏర్పాటుకు మొత్తం 10 మంది సభ్యులు అవసరం కాగా, ప్రస్తుతం 8 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో బోర్డు వ్యవహారాలు, తదుపరి నిర్ణయాల కోసం అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తాజా ఆదేశాలతో విజయ డెయిరీ బోర్డులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

