CM Chandrababu: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని, తప్పు చేసిన ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. తన నివాసంలో కూటమి ప్రభుత్వంలోని నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లడ్డూ వ్యవహారంపై సీబీఐ కూడా చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చిందని పేర్కొన్న చంద్రబాబు, గత పాలకులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. తప్పులు చేసి మళ్లీ తమపై ఆరోపణలు చేయడం దుర్మార్గమైన రాజకీయమని అన్నారు.
తిరుమల లడ్డూ వ్యవహారం కేవలం రాజకీయ విషయం కాదని, భక్తుల మత విశ్వాసాలకు సంబంధించిన అంశమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి మా కుటుంబ దైవం. దేవుడి నామాలు చూసినా భక్తి కలుగుతుంది. ప్రతి శనివారం ఉపవాసంగా ఉండే సంప్రదాయంలోనే పెరిగాం అని తెలిపారు. 2003లో అలిపిరిలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు, ప్రాణదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తిరుమల కొండపైకి వెళ్తున్న సమయంలోనే ఆ దాడి జరిగిందన్నారు. ఆ దాడి నుంచి బతికానంటే అది దేవుడి కృపే. నాకు పునర్జన్మ లభించింది. దేవుడిపై నమ్మకం లేకుండా ఉండలేను అని భావోద్వేగంగా చెప్పారు.
గడిచిన ఐదేళ్లలో కొన్ని శక్తుల ప్రవర్తన పరాకాష్టకు చేరిందని సీఎం విమర్శించారు. అంతర్వేదిలో రథం తగలబెట్టిన ఘటనపై చర్యలు తీసుకోకుండా, తిరిగి తమ పార్టీపై విమర్శలు చేశారని ఆరోపించారు చంద్రబాబు.. 2022లో వచ్చిన నివేదికలోనే లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు స్పష్టంగా వెల్లడైందని చంద్రబాబు తెలిపారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక, ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించి, టీటీడీ ఈవోను బాధ్యతల్లోకి తీసుకొచ్చి లోపాలను సరిదిద్దాలని ఆదేశించానని చెప్పారు. సిట్ నివేదికలో పామాయిల్‌తో నెయ్యి తయారు చేసినట్లు తేలిందని సీఎం పేర్కొన్నారు. ఇది భక్తుల విశ్వాసాలను తీవ్రంగా దెబ్బతీసే అంశమని అన్నారు. ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరూ రాలేదు. బ్రిటిష్ పాలకులు కూడా దేవుడి పవిత్రతను కాపాడారు అని వ్యాఖ్యానించారు.
సీబీఐ క్లీన్ చీట్ ఇవ్వలేదు
సీబీఐ నివేదిక ఎక్కడా కల్తీ లేదని చెప్పలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దేవుడి పవిత్రతను కాపాడటం అందరి బాధ్యత అని చెప్పారు. ఈ వ్యవహారంపై స్పష్టత కోసం మూడు పార్టీల సమావేశం నిర్వహించామని, తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది దేవుడి కార్యక్రమం కింద మాకు అప్పగించిన బాధ్యత అని అన్నారు. కల్తీ కలిసిన ప్రసాదాన్ని భక్తులు తీసుకున్నారన్న విషయం బాధాకరమని చెప్పారు. లడ్డూ తిరుమలకే పరిమితం. కానీ లడ్డూ తినాలంటే భక్తులు భయపడే పరిస్థితి వచ్చింది. తిరుమలకు రావడానికే సందేహపడే వాతావరణం ఏర్పడింది అని ఆందోళన వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకా హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, గతంలో తన చేతిలో కత్తి పెట్టినట్టే ఇప్పుడు కూడా దేవుడి విషయంలో తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. మన సమస్యలన్నీ ఆయనకే అప్పగిస్తాం. అటువంటి దేవుడిపై జరిగిన దాడిని సహించం అని స్పష్టం చేశారు. తిరుపతి వచ్చినప్పుడు దర్శనానికి ముందు డిక్లరేషన్‌పై సంతకం చేయాలని చెప్పామని, అబ్దుల్ కలాం కూడా సంతకం చేశారని సీఎం గుర్తు చేశారు. అన్యమతస్తులు దర్శనానికి వస్తే డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనని స్పష్టం చేస్తూ, దేవుడి పవిత్రతను కాపాడలేని అసమర్థులం కాదని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
