AP Weather: ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయవ్య, పశ్చిమ బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. మరోవైపు ఉపరితలం ఆవర్తనం, రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నాయని, దీంతో బుధవారం కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో జులై 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షి కోస్తాలో వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాయలసీమలో మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ అమరావతి విభాగం తెలిపింది. తీరం వెంబడి 30-40కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కాకినాడ, ఏలూరు, పార్వతీపురం మన్యం, కోనసీమ, ప్రకాశం, విజయనగరం, పల్నాడు, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ వివరించింది. గురు, శుక్ర వారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఇప్పటికే జిల్లాల యంత్రాంగాన్ని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.