Pawan Kalyan: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు మంగళగిరిలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీలతో పాటు 25 పార్లమెంట్ కమిటీల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమై పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల పనితీరు, క్షేత్రస్థాయి కార్యకలాపాలు, భవిష్యత్ కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ నేరుగా సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా ప్రతి పార్లమెంట్ కమిటీతో ప్రత్యేకంగా సమావేశమై స్థానిక పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో పార్టీ కార్యాచరణను మరింత వేగవంతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో జనసేనను బలోపేతం చేసే వ్యూహాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

