Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం

Pawan Kalyan World Elephant

Pawan Kalyan World Elephant

Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా ఏనుగుల సంరక్షణపై కీలక సందేశం ఇచ్చారు. ఏనుగులు కేవలం అడవి జంతువులు మాత్రమే కాదని, అవి అడవులకు సంరక్షకులు, పర్యావరణ సమతుల్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఏనుగులను తరతరాలకు ప్రకృతిని గౌరవించేలా స్ఫూర్తినిచ్చే విధంగా సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏనుగులు, వాటి ఆవాసాలు, ఏనుగు కారిడార్ల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ ద్వారా ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో వన్యప్రాణి సంరక్షణకు మరింత ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు.

ఏనుగుల సంరక్షణకు సహకరిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వన్యప్రాణుల రక్షణకు పలు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కుంకీ ఏనుగుల వినియోగంతో పాటు H.A.N.U.M.A.N. కార్యక్రమం ద్వారా వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన సిబ్బంది, అత్యాధునిక రెస్క్యూ మౌలిక వసతులు, టెక్నాలజీ, ర్యాపిడ్ రెస్పాన్స్ వ్యవస్థలను ఉపయోగించి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని పవన్ తెలిపారు. మానవులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలను తగ్గించడంతో పాటు సమర్థవంతమైన రక్షణ చర్యలు చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

సురక్షిత గ్రామాలు.. రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలు తమ లక్ష్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏనుగుల ఆవాసాలను, వాటి సహజ సంచార మార్గాలను కాపాడటం ద్వారా పర్యావరణ సమతుల్యతను పరిరక్షించవచ్చని తెలిపారు. భవిష్యత్ తరాలు ప్రకృతిని గౌరవించేలా ఏనుగుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. “ఏనుగులను కాపాడండి.. అడవులను కాపాడండి.. భవిష్యత్తును కాపాడండి” అనే సందేశంతో ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ తన సందేశాన్ని ముగించారు.