PAC Chairman Election: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైసీపీ కూడా… పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయడంతో… ఆసక్తి నెలకొంది. ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్ జరుగుతుంది. సభ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తారు. టీడీపీ తరపున ఏడుగురు సభ్యులు నామినేషన్లు వేశారు. జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు.. బీజేపీ తరపున విష్ణుకుమార్‌రాజు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే… పీఏసీ ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఎన్నికయ్యే అవకాశం ఉంది.
Read Also: Maoist Attack: వాజేడులో దారుణం.. ఇద్దరిని గొడ్డలితో నరికి చంపిన మావోలు..
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. వైసీపీ హయాంలో పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్ పనిచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో… పీఏసీ ఛైర్మన్ పదవికి తమకు ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ తరపున ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ కూడా వేశారు. అయితే… ఆ పదవికి వైసీపీ దక్కే అవకాశం లేదు. పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలన్నా, చైర్మన్ కావాలన్నా… 20 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ… అసెంబ్లీలో వైసీపీకి సంఖ్యా బలం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో… పీఏసీ చైర్మన్ పదవి దక్కదని కూటమి నేతలు చెప్తున్నారు. దీంతో.. జనసేనకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.