NTV Telugu Site icon

Nara Lokesh Praja Darbar: భూవివాదాలను త్వరగా పరిష్కరించండి.. మంత్రి లోకేష్‌ ఆదేశాలు

Lokesh

Lokesh

Nara Lokesh Praja Darbar: ప్రజా సమస్యల పరిష్కారం ఫోకస్‌ పెట్టారు మంత్రి నారా లోకేష్‌.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా దర్బార్‌ నిర్వహిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.. ఇక, 28వ రోజు కూడా మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు క్యూ కట్టారు ప్రజలు.. అయితే, భూవివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు లోకేష్.. సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఉండవల్లిలోని నివాసంలో 28వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను విన్నవించారు. ఆయా విజ్ఞప్తులను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం కోసం పెదవడ్లపూడికి చెందిన 40 మంది వృద్ధులు కలిసి సేకరించిన రూ.28వేల విరాళాన్ని “ప్రజాదర్బార్” లో మంత్రి నారా లోకేష్ ను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు మంత్రి లోకేష్‌.

Read Also: Supreme Court: ఆస్పత్రులు, డాక్టర్ల భద్రతపై నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు..

ఇక, మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడికి చెందిన రైతులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. వైసీపీ అండతో గ్రామంలోని ఉప్పలపాటి చెరువు కట్టను కొంతమంది ఆక్రమించారని, దీంతో వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని ఫిర్యాదు చేశారు. పెద్దవడ్లపూడిలో దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న 40 ఎకరాల రైతు పట్టా భూములను 2010లో నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రికార్డులు పరిశీలించి 22-ఏ నుంచి తమ భూములు తొలగించాలని గ్రామానికి చెందిన బాధిత రైతులు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. దివ్యాంగుడనైన తనకు ఎలాంటి ఆధారం లేదని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన షేక్ మౌలాలి విజ్ఞప్తి చేశారు. చిట్యాల ఐలమ్మ రజక ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని ఉండవల్లి గ్రామానికి చెందిన రజక సోదరులు కోరారు. బీకామ్ కంప్యూటర్స్ చదివిన తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని దుగ్గిరాలకు చెందిన చల్లపల్లి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్‌.

Read Also: Supreme Court: తెల్లవారుజామున ఘటన, రాత్రి 11.30 గంటలకు ఎఫ్ఐఆర్.? కోల్‌కతా వైద్యురాలి ఘటనపై సుప్రీం సీరియస్..

మరోవైపు.. నెల్లూరు జిల్లా సైదాపురం రెవెన్యూ పరిధిలో వంశపారంపర్యంగా వచ్చిన తన రెండెకరాల భూమిని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అండతో కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని నెల్లూరుకు చెందిన రావిళ్ల శ్రీనివాస నాయుడు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పోలియో వ్యాధి బారినపడి మంచానికే పరిమితమైన తనకు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఎమ్.మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు. పుట్టుకతో దీర్ఘకాలిక చర్మవ్యాధి బారినపడిన తమ కుమారుడికి పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మద్దిగుంట జగదీష్ చంద్రప్రసాద్ కోరారు.చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్ కు చెందిన యూనియన్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ కు ఆదేశాలు ఇవ్వాలని అసిసియేషన్ ప్రతినిధులు కోరారు. లాక్ డౌన్ సమయంలో అధికారులు రెన్యువల్ చేయలేదని, ఇప్పుడు జిల్లా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. స్టీల్ ఎక్స్ చేంజ్ ఇండియా లిమిటెడ్ యాజమాన్యం సేకరించిన తన 18 సెంట్ల స్థలానికి నష్టపరిహారం చెల్లించలేదని, విచారించి తగిన న్యాయం చేయాలని విజయవాడకు చెందిన కళ్లేపల్లి కృష్ణ విజ్ఞప్తి చేశారు.. ఇలా పలురకాల సమస్యలను మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు ప్రజలు.