Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో ఐఐటీ నిపుణుల భాగస్వామ్యం కీలకమని మంత్రి నారా లోకేష్ అన్నారు. పాన్ ఐఐటీ సదస్సులో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పరిశ్రమలు, పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 23 ఐఐటీలకు చెందిన దాదాపు 5 లక్షల మంది పూర్వ విద్యార్థులతో పాన్ ఐఐటీ సమాఖ్య ఉందని, వారి నైపుణ్యం, అనుభవాలను ఏపీ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ అభివృద్ధి మంత్రం స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ అని లోకేష్ పేర్కొన్నారు. పెట్టుబడుల విషయంలో కేవలం ఎంవోయూలు చేసుకోవడానికే పరిమితం కాకుండా.. ప్రాజెక్టులను వాస్తవ రూపంలోకి తీసుకురావడం, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

పాలసీలకు చట్టపరమైన, రాజకీయ స్థిరత్వం ఉండాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు. కాలానుగుణంగా విధానాలను మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అవి రాజకీయ మార్పులకు అతీతంగా స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, జీవోల రూపకల్పనలో కృత్రిమ మేధస్సు (ఏఐ)ను వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు 23 ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. హార్టికల్చర్ నుంచి క్వాంటం టెక్నాలజీ వరకు వివిధ రంగాలకు అనుగుణంగా ఈ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆక్వాకల్చర్, మెడికల్ డివైసెస్, ఫార్మా, ఆటోమోటివ్, సిమెంట్, సోలార్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి కీలక రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.

ఏపీలో డీప్‌టెక్, క్వాంటం పరిశోధనలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని లోకేష్ వెల్లడించారు. ఐఐటీలు, పరిశ్రమలు కలిసి పరిశోధనలు నిర్వహించడంతో పాటు ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 23 క్లస్టర్లకు ఐఐటీ నిపుణుల మార్గదర్శకత్వం అవసరమని, వారి సూచనలు తీసుకోవాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఐఐటీ పూర్వ విద్యార్థులు ఏపీ పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. వారి అనుభవాలు, పరిచయాలను రాష్ట్రంతో అనుసంధానం చేయడం ద్వారా కొత్త పెట్టుబడులు, సాంకేతికత, పరిశ్రమలకు అవకాశాలు పెరుగుతాయని అన్నారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పరిశోధనలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

పునరుత్పాదక విద్యుత్ రంగంలోనూ ఏపీ వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. గత ఏడాదిలో రాష్ట్రంలో 4.8 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని జోడించామని వెల్లడించారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ పేర్కొన్నారు. పాన్ ఐఐటీ సమాఖ్యలోని 23 ఐఐటీలకు చెందిన పూర్వ విద్యార్థులు, నిపుణుల సహకారంతో ఏపీని సాంకేతికత, పరిశ్రమలు, పరిశోధన రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు. అమరావతిని సాంకేతిక ప్రపంచానికి పరిచయం చేసేలా రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేస్తామని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..