NTV Telugu Site icon

YSR District to YSR Kadapa District: వైఎస్సార్‌ జిల్లా పేరు మార్చండి.. సీఎంకు మంత్రి సత్యకుమార్‌ లేఖ..

Ysr District

Ysr District

YSR District to YSR Kadapa District: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో పెట్టిన పలు ప్రభుత్వ పథకాల పేర్లను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పేరు తెరపైకి వచ్చింది.. నేడు వైయస్సార్ జిల్లాగా చలామణిలో ఉన్న కడప జిల్లాను వైయస్సార్ కడప జిల్లాగా గెజిట్ మార్పులు చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్.. “రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప. ఆదిమధ్యాంతరహితుడైన శ్రీనివాసుడు వెలసియున్న గొప్ప పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో శ్రీవారు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఉన్నారు. ప్రధానంగా ఈ ఆలయం హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతమంతా రాక్షస నిలయంగా ఉండేది. రాక్షసాంతకుడైన హనుమంతుడు ఈ ప్రాంత వాసులకు దానవ పీడ తొలగించడానికి మశ్స్యావతారంగా ఆవిర్భవించాడని ప్రసిద్ధి అంటూ లేఖలో పేర్కొన్నారు సత్యకుమార్‌..

Read Also: KBR Park: సరికొత్తగా కేబీఆర్ పార్క్.. చుట్టూ ఫ్లైఓవర్స్, అండర్ పాస్‌లను గ్రీన్ సిగ్నల్..

ఇక, ఆ తరువాత కృపాచార్యుల వారు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి హనుమత్ క్షేత్రమైన ఈ క్షేత్రంలో బస చేశారు. అక్కడ నుండి వారు తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలని సంకల్పించారు. కానీ కొన్ని పరిస్థితుల వలన వారు ముందుకు సాగలేకపోయారు. శ్రీవారి దర్శనాభిలాషతో కృపాచార్యులు తపించి పోయారు. శ్రీవారి కరుణను పొందారు, స్వామి సాక్షాత్కారాన్ని పొంది కృతార్థులైనారు. శ్రీవారి కృప పొందిన ప్రదేశం కనుక వారు ఈ ప్రాంతాన్ని కృపావతిగా నామకరణం చేశారు. ఆ కృపావతి కురుపగా, కుడపగా క్రమేపి కడపగా ప్రసిద్ధి చెందిందని లేఖలో రాసుకొచ్చారు.. శ్రీవారి దర్శనాన్ని పొందిన కృపాచార్యులు తన్న వలే తిరుమల క్షేత్రానికి వెళ్లలేని నిస్సహాయుల కొరకు తిరుమల శ్రీవారి ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. శ్రీవారి ఆదేశానుసారం హనుమంతుడి విగ్రహం ముందు ప్రతిష్ఠించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త వత్సలుడై ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. నాటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించడానికి వెళ్లే భక్తులు ముందుగా దేవుని కడప శ్రీవారిని దర్శించి తిరుమలకు వెళ్లడం ఆచారంగా మారిపోయింది.

Read Also: Thalapathy 69: గ్రాండ్ గా మొదలైన దళపతి విజయ్ చివరి సినిమా

అయితే, ఇంతటి గొప్ప చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న కడప పేరును గత ప్రభుత్వం అవగాహనరాహిత్యంతో వైయస్సార్ జిల్లాగా పేరు మార్చడం జరిగింది. దీనితో శ్రీవారి భక్తుల మనసులు నొచ్చుకున్నా భయం చేత ఎవరూ తమ అభిప్రాయాలను బయటపెట్టలేదు. నేను గతంలో శాసనసభలో ఇదే విషయాన్ని ప్రస్తావించాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. కాబట్టి కడవ చారిత్రక నేపథ్యాన్ని, డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నేడు వైయస్సార్ జిల్లాగా పిలవబడుతున్న ఈ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా మార్చవలసిందిగా మనవి చేసుకుంటున్నాను..” అంటూ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్.. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Show comments