Site icon NTV Telugu

Minister Atchannaidu: పత్తి రైతులను ఆదుకోండి.. కేంద్రానికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ..

Atchannaidu

Atchannaidu

Minister Atchannaidu: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్‌ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మొంథా తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని లేఖలో పేర్కొన్నారు. రైతులు ప్రస్తుతం కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తిని విక్రయించాల్సి వస్తోందని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2025–26 ఖరీఫ్‌ సీజన్‌లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరుగుతుందని, దాదాపు 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే CM APP మరియు ఆధార్ ఆధారిత e-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. అయితే, కేంద్రం ప్రవేశపెట్టిన Kapas Kisan App ను రాష్ట్ర CM APP తో అనుసంధానం చేసిన తరువాత సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతుల వివరాలు Kapas Kisan App నుండి CM APP కు రియల్ టైమ్‌లో సమన్వయం అయ్యేలా చర్యలు తీసుకోవాలి అని సూచించారు.

Read Also: Nalgonda: కాబోయే డాక్టర్లు ఇదేం పని.. నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..

ఇక, రైతులు సమీప జిల్లాల్లోని జిన్నింగ్‌ మిల్లుల్లోనే పత్తి విక్రయం చేసుకునేలా మ్యాపింగ్‌ చేయాలని, దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా చూడాలని కోరారు అచ్చెన్నాయుడు.. L1, L2, L3 జిన్నింగ్‌ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే, Kapas Kisan App నిర్వహణ కోసం గుంటూరులో ప్రత్యేక సాంకేతిక సిబ్బంది నియామకం అవసరమని సూచించారు. వాతావరణ ప్రభావంతో తేమ శాతం 12–18 శాతం ఉన్న పత్తిని అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయాలని, అలాగే వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తికి తగిన ధర చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ చర్యలు రైతుల అసంతృప్తిని తగ్గించి, వారికి ఆర్థిక భరోసా కల్పిస్తాయని అచ్చెన్నాయుడు నమ్మకం వ్యక్తం చేశారు. చివరగా, సహజ విపత్తుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్రం తక్షణ సహకారం అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.

Exit mobile version