AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసులో SIT దర్యాప్తు ఆధారంగా, నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను అటాచ్ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. SIT నివేదిక ప్రకారం, మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన కమీషన్లు, కిక్‌బ్యాక్‌లు మరియు బ్లాక్ మనీ సహాయంతో చెవిరెడ్డి కుటుంబం రూ.63.72 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో బయటపడింది. అధికారిక రిజిస్ట్రేషన్ విలువను కేవలం రూ.8.85 కోట్లుగా చూపించినప్పటికీ, నిజానికి వాటి విలువ రూ.54.87 కోట్లుగా SIT గుర్తించింది.
Read Also: Wedding video: పెళ్లి వేడుకలో వరుడి మామ పాడుబుద్ధి.. అందరూ చూస్తుండగా డ్యాన్సర్‌ను ఏం చేశాడంటే..!
సిట్ దర్యాప్తు సూచనల మేరకు ప్రభుత్వం క్రింది పేర్లపై ఆస్తుల అటాచ్‌కు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మోహిత్ రెడ్డి భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ (అలియాస్ లక్ష్మి), సీఎంఆర్ ఇన్‌ఫ్రా పేరుతో ఉన్న ఆస్తులు, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరుతో ఉన్న ఆస్తులు అటాచ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. చెవిరెడ్డి కుటుంబం మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బుతో స్థిర, చర ఆస్తులు విపరీతంగా కొనుగోలు చేసినట్లు SIT పేర్కొంది. రిజిస్ట్రేషన్ విలువను తక్కువగా చూపించి, పెద్ద మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా బ్లాక్ మనీగా మార్చినట్లు రికార్డులు వెల్లడించాయి.
తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టంబేడు, అలాగే నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు, మరియు చిత్తూరు జిల్లా పుత్తూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డులు ఉన్నట్లు SIT పేర్కొంది. వెండోడులోని అరబిందో ఫార్మాకు KVS ఇన్‌ఫ్రా ద్వారా జరిగిన 263.28 ఎకరాల భూమి కొనుగోలు–అమ్మకాల్లో భారీ మోసం జరిగిందని SIT తేల్చింది. ఆ సమయంలో భూమి విలువలు అప్రత్యక్షంగా పెంచి.. పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని వైట్‌గా మార్చినట్లు నిర్ధారించింది. ఈ ఒక్క లావాదేవీ ద్వారానే KVS ఇన్‌ఫ్రా రూ.13.3 కోట్లు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చిందని SIT నివేదిక తెలిపింది.
దర్యాప్తు నివేదిక ఆధారంగా అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ చట్టాల్లోని పలు సెక్షన్ల ప్రకారం ఆస్తుల అటాచ్‌కు అనుమతి ఇవ్వాలని SIT ప్రభుత్వంను కోరింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, ఆస్తుల అటాచ్ కోసం విజయవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు అనుమతి ఇచ్చింది. డీజీపీ తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులను హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జారీ చేశారు.
