NTV Telugu Site icon

AP Liquor Shop Tenders 2024: మద్యం షాపులకు మందకోడిగా టెండర్లు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..

Ap Liquor Policy

Ap Liquor Policy

AP Liquor Shop Tenders 2024: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం.. ప్రైవేట్ మద్యం షాపులకు టెండర్లు పిలిచింది.. అయితే, ఏపీలో మద్యం షాపులకు మందకోడిగా దాఖలవుతున్నాయి టెండర్లు. ఆరు రోజుల వ్యవధిలో 3,396 షాపులకు గానూ కేవలం 8,274 టెండర్లే దాఖలు అయ్యాయి.. స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపునకు 2-3 టెండర్లు మాత్రమే వచ్చాయంటోంది ఏపీ ఎక్సైజ్ శాఖ. భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడడంతో ప్రభుత్వ అంచనాలకంటే తక్కువగా మద్యం టెండర్లు వస్తున్నట్టు అంచనావేస్తున్నారు.. మరో మూడు రోజుల్లో టెండర్ల దాఖలు గడవు ముగియనుంది.. ఇప్పటి వరకు అత్యధికంగా విజయనగరం జిల్లాలో 855 టెండర్లు దాఖలు కాగా.. అత్యల్పంగా మన్యం జిల్లాలో కేవలం 174 టెండర్లే దాఖలు చేశారు..

Read Also: Vasavi Matha: శరన్నవరాత్రి ఉత్సవాలలో రూ.6,66,66,666తో వాసవీ కన్యకాపరమేశ్వరి అలంకరణ

ఇక, తిరుపతి, నెల్లూరు జిల్లాలో మద్యం టెండర్లల్లో సీన్ రివర్స్ చేస్తున్నారు బిడ్డర్లు. తిరుపతి జిల్లాలో 227 షాపులకు గానూ కేవలం 165 టెండర్లు మాత్రమే దాఖలు అయ్యాయి.. నెల్లూరు జిల్లాలో 182 షాపులకు 179 టెండర్లు మాత్రమే దాఖలు చేశారు.. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కొన్ని షాపులకు టెండర్లు వేసేందుకే అసలు ముందుకే రావడం లేదు.. ఎన్టీఆర్, విజయనగరం జిల్లాల్లో ఒక్కో మద్యం షాపునకు యావరేజీన 5-6 టెండర్లు, ఏలూరు జిల్లాలో 4-5 టెండర్లు దాఖలు అయ్యాయి.. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.. మద్యం టెండర్లల్లో సిండికేట్ కాకుండా చూసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది సర్కార్. ఈ మేరకు జిల్లా అధికారులకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సూచనలు చేశారు.. 15-20 వేల టెండర్లు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేయగా.. ఇప్పటి వరకు 9 వేలు కూడా దాటని పరిస్థితి ఉంది.. టెండర్లకు మరో మూడు రోజుల గడువు ఉండడంతో టెండర్లు ఎన్ని వస్తాయోనేది ఉత్కంఠగా మారింది.. కాగా, ఈ నెల 11 తేదీన ఉదయం 8 గంటలకు లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించనున్నారు అధికారులు. ఏ జిల్లాకు ఆ జిల్లాల్లోనే లాటరీ తీయనున్నారు.

Show comments