Site icon NTV Telugu

Jana Sena Party Membership: జనసేన సభ్యత్వ నమోదుపై పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం..

Pawan Kalyan

Pawan Kalyan

Jana Sena Party Membership: జనసేన పార్టీ నిర్వహిస్తున్న ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో గడువును మార్చి 17వ తేదీ వరకు పొడిగించారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రస్తుతం గ్రామాల నుంచి పట్టణాల వరకు విస్తృతంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న జనసేన శ్రేణులు, అభిమానులు కూడా సభ్యత్వాన్ని పొందుతున్నారు. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఆన్‌లైన్ ద్వారా సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు.

Read Also: కిడ్నీలు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినండి చాలు.!

ఈ కార్యక్రమానికి గడువు తొలుత మార్చి 10తో ముగియాల్సి ఉండగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సభ్యత్వ నమోదు గడువును పెంచాలని కేంద్ర కార్యాలయానికి విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై స్పందించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సభ్యత్వ నమోదు గడువును మార్చి 17 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ శాసన సభ్యులు కూడా మరికొన్ని రోజులు గడువు అవసరమని కోరినట్లు సమాచారం. సభ్యత్వ నమోదు ప్రారంభమైన సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ఎమ్మెల్యేలు వాటిలో నిమగ్నమయ్యారని, ఇప్పుడు తమ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక వేడుకలా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించేందుకు గడువును పెంచినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Exit mobile version