India US Trade Deal: అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక చారిత్రక మైలురాయిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఈ కీలక ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్–అమెరికా మధ్య బంధం ఈ ఒప్పందంతో మరింత బలోపేతం కానుందని చంద్రబాబు పేర్కొన్నారు. నిరంతర గ్లోబల్ వృద్ధికి దోహదపడే దూరదృష్టిగల నిర్ణయమిదని ప్రశంసించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ ఒక గ్లోబల్ ఆర్థిక శక్తిగా మరింత పటిష్టమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు, రైతులకు విస్తృత అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.
Read Also: Hyderabad: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి సూసైడ్ కేసులో ఊహించని ట్విస్ట్.. భర్త ఏమన్నారంటే?
ఇదే విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రధాని మోడీకి అభినందనలు తెలిపారు. వారం వ్యవధిలోనే రెండు ప్రపంచ స్థాయి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చిందని అన్నారు. యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ అనంతరం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కుదిరిన ఒప్పందం భారత్ ఆర్థిక భవిష్యత్తును మరింత బలోపేతం చేయనుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అమెరికాతో ఒప్పందం ద్వారా టారిఫ్ ఛార్జీలు 18 శాతానికి తగ్గడం రైతులకు పెద్ద ఊరటగా మారిందని తెలిపారు. ఎగుమతులు పెరగడం వల్ల రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సమయానుకూలంగా దృఢ నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందాలతో భారత్ అంతర్జాతీయ వాణిజ్యంలో మరింత బలమైన స్థానాన్ని సంపాదించుకోనుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
