Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది కూటమి సర్కార్. ఇవాళ అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి సభలు నిర్వహించబోతోంది. ఉపాధి హామీ పనులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభల ద్వారా ఆమోదం పొందేందుకు ఒకేసారి ఈ కార్యక్రమం చేపడుతోంది. కోనసీమలో బాబు, రాయలసీమలో పవన్ పర్యటించనున్నారు. ఐదేళ్ల కాలంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించాయి కూటమి పార్టీలు. అధికారంలోకి వస్తే పంచాయతీ రాజ్ సంస్థలను గాడిలో పెడతామని హామీ ఇచ్చాయి. చెప్పినట్టుగానే స్థానిక సంస్థలకు సుమారు 2 వేల కోట్ల రూపాయలకు మేర ఇవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధులను ఆయా ఖాతాల్లో జమ చేసింది. అలాగే గ్రామాల్లో ఆస్తుల కల్పనకు.. వ్యవసాయ అనుబంధ పనులకు ఉపాధి హామీ పనులను సక్రమంగా వినియోగించుకునే దిశగా కొంత కాలంగా కసరత్తు చేస్తోంది సర్కార్.
Read Also: Pakistan : పాకిస్థాన్‌లో పోలీసు వాహనాలపై రాకెట్ దాడి, 11 మంది పోలీసులు మృతి
మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఒత్తిడితో కేంద్రం కూడా అదనంగా ఉపాధి హామీ నిధులను కేటాయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు ఓ క్రమపద్దతిలో నిర్వహించాలని సర్కార్ డిసైడ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి.. నరేగా పనులకు ఆమోదం తెలిపేలా ఓ మెగా ప్రొగ్రాం నిర్వహించబోతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజున 13 వేల 326 పంచాయతీల్లో సభలు నిర్వహించి రికార్డు సృష్టించబోతోంది సర్కార్. ఉపాధి హామీ పధకంలో ప్రతి కుటుంబానికీ సంవత్సరంలో 100 రోజుల పని దినాలను కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఒకే రోజున నిర్వహిస్తున్న ఈ గ్రామ సభల్లో 4 వేల 500 కోట్ల రూపాయల మేర పనులకు ఆమోదం తీసుకోనున్నారు. మరోవైపు ఈ గ్రామసభల నిర్వహణ కార్యక్రమం రాజకీయంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కోనసీమ జిల్లా వానపల్లి గ్రామసభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అలాగే అన్నమయ్య జిల్లా మైసూరివారిపల్లె గ్రామసభలో పపన్ కల్యాణ్ పాల్గొంటున్నారు.
