Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.. మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల తేదీల నిర్ణయంలో తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన జ్యోతిష్య అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పుష్కరాల నిర్వహణపై కమిషనర్ సమర్పించిన నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై దేవదాయ శాఖ ఎక్స్‌ఆఫిషియో సెక్రటరీ డా. ఎం. హరి జవహర్లాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా సహా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై త్వరలోనే కార్యాచరణ ప్రారంభం కానుంది.
Read Also: Dhurandhar : బాలీవుడ్ ‘ధురంధర్’ సినిమాపై .. పుష్ప రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మొత్తంగా 2027లో నిర్వహించనున్న గోదావరి నది పుష్కరాల తేదీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. 2027 జూన్ 26న ప్రారంభమయ్యే పుష్కరాలు 12 రోజుల పాటు కొనసాగి జూలై 7న ముగుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ (దేవాదాయ) శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అందించిన పండితాభిప్రాయం ఆధారంగా ఈ తేదీలను నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. టీటీడీ సిద్ధాంతి సూచనలను దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించగా, వాటిని పరిశీలించిన ప్రభుత్వం తుది ఆమోదం తెలిపింది. గోదావరి పుష్కరాల తేదీల ఖరారుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పుష్కరాలకు ఇంకా సుమారు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ, ఏర్పాట్లను ముందుగానే ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం ముందస్తుగా తేదీలను ప్రకటించడం గమనార్హం. ఈ ప్రకటనతో పుష్కరాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వసతి తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు అధికార యంత్రాంగానికి స్పష్టత లభించినట్లు అధికారులు భావిస్తున్నారు.