Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్‌లోకి రావాలి..!

  • వికసిత్ భారత్‌కు యువతే వెన్నెముక..
  • అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు..
  • 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్‌లోకి రావాలి..
  • యువతకు గోవా సీఎం కీలక సూచన..
Pramod Sawant

Pramod Sawant

Pramod Sawant: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. దేశంలో దాదాపు 50 శాతం మంది యువత ఉన్నారని, వారి శక్తి, ప్రతిభను సరైన దిశలో వినియోగిస్తే వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలా? వస్తే ఎప్పుడు రావాలి? అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారిందని ప్రమోద్ సావంత్ వ్యాఖ్యానించారు. అయితే రాజకీయాల్లోకి రావడానికి ముందు అనుభవం, స్థిరత్వం ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. 40 ఏళ్ల వయసు తర్వాత రాజకీయాల్లోకి రావడం మంచిదని, ముందుగా జీవితంలో అనుభవం, స్థిరత్వాన్ని సాధించుకుని ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని సూచించారు.

వికసిత్ భారత్‌కు యువశక్తి, నారీశక్తి, కిసాన్ శక్తి, గరీబ్ కళ్యాణ్ నాలుగు ప్రధాన మూలస్తంభాలని ప్రమోద్ సావంత్ అన్నారు. గతంలో దేశంలోని ఎంతోమందికి బ్యాంకు ఖాతాలు కూడా లేవని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం జనధన్ ఖాతాల ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి ప్రజలను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 5G కనెక్టివిటీ కూడా అందుబాటులోకి వచ్చిందని, దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో భారత్ వికసిత్ భారత్ 2047 లక్ష్యం వైపు అడుగులు వేస్తోందని సావంత్ అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో యువతదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. కేవలం రాజకీయాల్లోకి రావడమే కాకుండా దేశ అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనలోనూ యువత భాగస్వాములు కావాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి ప్రణీత్ రైతులకు సహాయం చేసేందుకు శ్రీకాకుళంలో పనిచేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు ప్రమోద్‌ సావంత్… ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేలా యువత పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళ్తున్నారని ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో యువత కూడా భాగస్వాములు కావాలని అన్నారు. దేశానికి పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న యువత చాలా అవసరమని సావంత్ తెలిపారు. కేవలం రాజకీయాల్లోకి ప్రవేశించడం కాకుండా మంచి పాలసీలను రూపొందించగలిగే స్థాయికి యువత ఎదగాలని సూచించారు. సమాజంలో మార్పు తీసుకురావడంతో పాటు ఫలితాలు సాధించేలా పనిచేసే యువత అవసరమన్నారు. భవిష్యత్తులో యువత ఎంట్రప్రెన్యూర్లు, పాలసీ మేకర్లు, రాజకీయ నాయకులుగా ఎదగాలని ప్రమోద్ సావంత్ ఆకాంక్షించారు. దేశం కోసం బాధ్యతతో పనిచేసే, పారదర్శకతను పాటించే, ప్రజల పట్ల నిబద్ధత కలిగిన యువతే భారత్‌ను ముందుకు తీసుకెళ్లగలదని ఆయన అన్నారు. యువశక్తిని సరైన విధంగా వినియోగించుకున్నప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారం అవుతుందని పేర్కొన్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్..