Site icon NTV Telugu

Kethireddy Venkatarami Reddy: కోడిని కోసినా కేసులు పెడుతున్నారు.. కూటమికి వినాశనం తప్పదు..!

Kethireddy Venkatarami Redd

Kethireddy Venkatarami Redd

Kethireddy Venkatarami Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కోడిని కోసినా కేసులు పెట్టే పరిస్థితి నెలకొందని, ఈ విధమైన పాలనతో కూటమికి వినాశనం తప్పదని ఆయన హెచ్చరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లు గడిచినా రాష్ట్ర పరిస్థితి మారలేదని అన్నారు. ప్రభుత్వం ప్రజలను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తోందని ఆరోపించారు. రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అమరావతిలో ఏదో జరుగుతోందన్న ప్రచారం మాత్రమే చేస్తున్నారని, కోట్లకు కోట్లు అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం అంటున్నారని అన్నారు. రాజధాని కోసం తొలి విడతలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, రిటర్నబుల్ ప్లాట్ల వ్యవహారం ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉందని చెప్పారు. రెండో విడత రాజధాని కోసం 1.75 లక్షల ఎకరాలు కావాలంటూ ఎవరి భూములను నాశనం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు.

Read Also: Mohan Babu: బెంగాల్ గవర్నర్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకున్న మోహన్ బాబు

మీరు చేసిన పరేడ్‌లో అప్పుడెప్పుడో కట్టిన క్వార్టర్స్ చూపిస్తున్నారని, కంప చెట్లు కొట్టేందుకు కూడా కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు కేతిరెడ్డి… పనుల పేరుతో పర్సంటేజీలు తీసుకుంటున్నారని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న ప్రభుత్వం వాటికి సంబంధించిన డేటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులపై చూపుతున్న శ్రద్ధ అభివృద్ధిపై చూపడం లేదని మండిపడ్డారు. ప్రజలు మోసపోయారని, సూపర్ సిక్స్ హామీల వాస్తవాలు ఇప్పుడు బయటపడుతున్నాయని చెప్పారు. లేచిన దగ్గర నుంచి తమ నాయకుడు జగన్‌పై, తమపై పడుతూ ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక, దావోస్ వెళ్లి ఏమి తెచ్చారో చెప్పలేదని, పరిపాలన, లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు ప్రతీదీ గమనిస్తున్నారని, అన్ని రంగాల్లో భయం, నిస్సహాయత నెలకొందని అన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను సరిగా చెప్పుకోలేకపోయామని ఒప్పుకున్న కేతిరెడ్డి, కోవిడ్ కారణంగా రెండేళ్లు నష్టపోయామని చెప్పారు. ఎవరో చేసిన పనికి తమ నేత జగన్ పేరు వేయించుకోడని స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై అపోహలు సృష్టించారని, చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మారని ఆరోపించారు. మూడు పంటలు పండే అమరావతి ప్రాంతం బాగుండాలని తమ ఆకాంక్ష అని, ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ కాదు ఆక్వా వ్యాలీ వస్తుందన్న మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని తెలిపారు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని, ఒక ముఖ్యమంత్రిగా ఉండి విచక్షణ అవసరమని వ్యాఖ్యానించారు. ప్రజలు నిజాలు అర్థం చేసుకుంటున్నారని, మార్పు మొదలైందని, చివరకు కూటమికి వినాశనం తప్పదని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు.

Exit mobile version