Cyclone Montha: మొంథా తుఫాన్ కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి పి. నారాయణ, స్పెషల్ ఆఫీసర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో 12 మండలాలపై ప్రభావం ఉంటుందనీ తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించారు పవన్ కల్యాణ్.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగు నీరు, పాలు, ఔషధాలు సమకూర్చుకోవాలి అన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నందున ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రజలకు తెలియచేయాలని తెలిపారు. తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి, విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుంది.. వాటి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగుల వివరాలు తెలుసుకొని.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Hyderabad: మత్తు మందు జల్లి.. డబ్బులతో ఉడాయిస్తున్న దొంగ బాబాలు అరెస్ట్
