Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: వారి ఉచ్చులో పడొద్దు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ విజ్ఞప్తి

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. ఏపీలో జరుగుతోన్న తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. రాష్ట్రంలో అభివృద్ధి దిశగా… సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయి. ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. సామాజిక మాధ్యమాల ముసుగులోనో, యూట్యూబ్ ఛానెళ్ల పేరుతోనో, మరో మార్గంలోనో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఇలా కుయుక్తులతో సమాజంలో అశాంతి, అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని పదేళ్లుగా చూస్తున్నాం. వారి ఉచ్చులో పడి, ఆవేశాలకు లోనై, ఘర్షణ వాతావరణానికి తావీయవద్దు. అలా ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు..

సమస్య జటిలం చేయవద్దన్న పవన్‌..
ఇటీవల మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు ఉదాహరణగా చూసిన పవన్‌ కల్యాణ్.. ఒక యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడాడు. అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి, ప్రచారం చేయడం వెనక ఉన్న కుత్సిత ఆలోచనను పసిగట్టాలి. దానిపై చట్ట ప్రకారం కేసులుపెట్టి ముందుకు వెళ్ళాలి. తొందరపడి మరో మార్గంలో వెళ్లి ఘర్షణపడటం ద్వారా సమస్య జటిలం అవుతుంది. ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారని పేర్కొన్నారు పవన్‌..

ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశం..
కులాలు, మతాల మధ్య విభేదాలు తీసుకువచ్చే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయాలి. ఈ దిశగా ముందుకు వెళ్లాలని జనసేన నాయకులు, శ్రేణులతోపాటు కూటమి నాయకులకు సూచిస్తున్నాను. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ రూపంలోనో, విశ్లేషకుల ముసుగులోనో రెచ్చగొట్టే వారిని, అభ్యంతరకర రీతిలో మాట్లాడేవారిని భారత న్యాయ సంహిత ప్రకారం చట్టం ముందు నిలపాలి. వీరి వెనక ఉండి వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టి కుట్రలు చేసేవారిపైనా ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలి. మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ చేయాలని నాయకులకి ఆదేశాలు ఇచ్చాను. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని స్పష్టం చేయడమైనది. కుట్రలు చేసేవారి కుత్సిత నైజం కలిగిన పార్టీ, ఆ పార్టీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వారు చేసే దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా, చట్ట ప్రకారమే తిప్పికొడదాం అంటూ పిలుపునిచ్చారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్..

Exit mobile version