AP Rain Alert: ఏపీకి మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు..! జిల్లాల వారీగా తాజా అంచనా

Rainalert

Rainalert

AP Rain Alert: ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, రేపు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఈ తీవ్రవాయుగుండం ఛత్తీస్‌గఢ్–మధ్యప్రదేశ్ వైపు కదిలే అవకాశముందని వెల్లడించింది. తీవ్రవాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జిల్లాల వారీగా చూస్తే పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మార్కాపురం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

ఇక, గత 24 గంటల్లో అమలాపురంలో అత్యధికంగా 72.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంకిపాడులో 67.2 మి.మీ., పెనమలూరులో 64.6 మి.మీ., అయినవిల్లిలో 62.8 మి.మీ., పోడూరులో 60.4 మి.మీ., పి.గన్నవరంలో 58 మి.మీ., కలిదిండిలో 55.6 మి.మీ., భీమవరంలో 52.6 మి.మీ., ముదినేపల్లిలో 52.4 మి.మీ., ముమ్మడివరంలో 50.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు..

ప్రజలు ఉరుములు, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, భారీ హోర్డింగ్స్ సమీపంలో ఆశ్రయం పొందవద్దని సూచించారు. అలాగే తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. సముద్రంలో అలలు ఉధృతంగా ఉన్న సమయంలో చిన్న పడవలతో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచిస్తూ, వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.