Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కి వరుస తుఫాన్‌లు తప్పేలా లేవు.. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు సమాచారం. దీని ప్రభావంతో సముద్రంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశముంది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి ఎల్లుండి నాటికి వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. అనంతరం ఇది మరింత బలపడి ఈ నెల 19వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి.
ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి మచిలీపట్నం మధ్య తీర ప్రాంతంలో తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. అయితే తుఫాన్ తీవ్రత, దిశ, తీరం దాటే ప్రాంతంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. రానున్న రోజుల్లో వాతావరణ శాఖ వెల్లడించే తాజా బులెటిన్ల ఆధారంగా తుఫాన్ కదలికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనించాలని సూచిస్తున్నారు. అయితే, ఇప్పటికే వరుసగా రెండు తుఫాన్లు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టాన్ని మిగిల్చగా.. మరో తుఫాన్ ఎలాంటి బీభత్సం సృష్టించబోతుందనే ఆందోళన నెలకొంది..

