Cyclone Akwan Alert: దిశ మార్చుకోనున్న అక్వాన్!.. ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు..

Cyclone Arnab

Cyclone Arnab

Cyclone Akwan Alert: ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు మరో తుఫాన్‌ దూసుకొస్తుంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది. ఈ తుఫాన్‌ గమనం, దిశలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. యాంటీ సైక్లోన్ వ్యవస్థల ప్రభావంతో తుఫాన్‌ దిశ మారి మరోసారి దక్షిణ కోస్తాంధ్ర వైపు కదిలే ప్రమాదం ఉందని సమాచారం. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సోమవారం సాయంత్రానికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది. అనంతరం దీని ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతంలో గాలుల తీవ్రత పెరగనుంది. తుఫాన్‌ తీరం వైపు దూసుకొస్తే గంటకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని కొన్ని అంచనాలు పేర్కొంటున్నాయి.

ముఖ్యంగా మచిలీపట్నం దిగువ ప్రాంతం మీదుగా తుఫాన్‌ ప్రయాణించే అవకాశం ఉందనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యాంటీ సైక్లోన్ వ్యవస్థల కారణంగా తుఫాన్‌ ప్రయాణించే దిశలో మార్పులు రావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతాలపై తుఫాన్‌ ప్రభావం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం నవంబర్ 16 సాయంత్రానికి తుఫాన్‌గా.. నవంబర్ 17 సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. అనంతరం నవంబర్ 19 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక, తుఫాన్‌ దిశ, తీరం దాటే ప్రాంతం, గరిష్ట గాలుల వేగంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు..