NTV Telugu Site icon

AP Pensions: పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు.. ఎక్కడంటే..?

Cbn

Cbn

AP Pensions: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జులై 1వ తేదీన (సోమవారం) పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది.. ఇప్పటికే పింఛన్ల పంపిణీకి సర్వం ఏర్పాటు చేసింది.. నిధులను విడుదల చేయడంతో.. రేపు ఆదివారం కావడం.. సోమవారం ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ మొదలుకానుండడంతో.. బ్యాంకుల నుంచి డబ్బులను కూడా డ్రా చేసిపెట్టుకున్నారు.. ఎన్నికల హామీని నిలబెట్టుకుని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పింఛన్లు పంపిణీ చేస్తుండడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జులై 1వ తేదీ పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్దిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందులో భాగంగా స్వయంగా సీఎం కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇలా ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ పింఛన్ల పంపినీ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.

Read Also: Car Prices: భారీగా తగ్గిన కార్ల ధరలు..రూ.82,000 వరకు డిస్కౌంట్!

అయితే, మేం అధికారలోకి వస్తే పెన్షన్‌ను పెంచనున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం విదితమే.. దాని అనుగుణంగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ ఫైల్‌పై సంతకం చేశారు.. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల పించన్ నాలుగు వేలకు పెంచింది కూటమి సర్కారు.. ఏప్రిల్ నెల నుంచే పెంచిన మొత్తాన్ని ఇస్తామని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేయగా.. ఆ ప్రకారం జులై నెలకు ఇచ్చే నాలుగు వేల ఫించన్ తోపాటు గడచిన మూడు నెలలకు ఇవ్వాల్సిన మూడు వేల రూపాయలను కలిపి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు.. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో సామాజిక ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే కావడం మరో విశేషం..