CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

Cm Cbn Reviews On Heavy Rai

Cm Cbn Reviews On Heavy Rai

CM CBN Reviews on Heavy Rains: తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే అధికారులు వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. భారీ వర్షాలతో నీటి ఉధృతికి రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. చెరువులు నింపడంపై దృష్టి పెట్టడంతో పాటు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే స్పందించేలా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రజల నుంచి పరిస్థితిపై అభిప్రాయాలను సేకరించేందుకు ఐవీఆర్ఎస్ విధానాన్ని కూడా వినియోగించాలని చంద్రబాబు సూచించారు. భారీ గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడిన నేపథ్యంలో వాటిని వెంటనే తొలగించి రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఇక, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, నీటి ప్రవాహానికి అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. వర్షాలు, వరదల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..