NTV Telugu Site icon

Vizag and Vijayawada Metro Rail: విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ మెట్రో.. సీఎం సమీక్ష..

Cbn

Cbn

Vizag and Vijayawada Metro Rail: ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. 2017 వరకు 100 శాతం నిధులు కేంద్రం భరించే విధానం అమలులో లేదు. అయితే 2017 పాలసీ ప్రకారం 100 శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్‌కత్తాలో 16 కిలో మీటర్ల మేర ప్రాజెక్టు చేపట్టారు. రూ.8,565 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ, రైల్వే శాఖలు కోల్‌కత్తా ప్రాజెక్టును చేపట్టాయి. ఇదే తరహాలో ఏపీలో కూడా మెట్రో పాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని సీఎం అన్నారు. ఆ చట్ట ప్రకారమయినా.. లేకపోతే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్ర సాయం చేయాలన్నారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

Read Also: Multivitamin : మల్టీ విటమిన్‌ ఉండే ఆహార పదార్థాలు..

విశాఖ, విజయవాడలలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నారు. హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ విధానంలో కింద రోడ్డు దానిపైన ఫ్లైవోవర్ ఆపైన మెట్రో వస్తుంది. విశాఖలో మొదటి స్టేజ్ లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కి.మీ, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కి.మీ డబుల్ డెక్కర్ మోడల్ లో మెట్రో నిర్మించనున్నారు. అలాగే విజయవాడలో రామవరప్పాడురింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు. ఇప్పటికే ఈ తరహా మోడళ్లు పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రంలోనూ ఈ తరహా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రంతో త్వరతిగతిన సంప్రదింపులు పూర్తి చేసి మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 4 ఏళ్లలో రెండు నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పనిచేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.

Show comments