CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై మరోసారి ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీన అన్ని శాఖల హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ (HODs), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంబంధించిన స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) లక్ష్యాలు, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా అమలవుతున్న సేవలు, అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల అమలు పురోగతిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు ఈ భేటీకి అన్ని శాఖల మంత్రులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టమైన సూచనలు జారీ అయ్యాయి. అభివృద్ధి కార్యక్రమాల సమన్వయం, జిల్లాల వారీగా పెండింగ్ పనుల వేగవంతం, ప్రజలకు సేవలు మరింత చేరువయ్యేలా తీసుకోవాల్సిన పరిపాలనా నిర్ణయాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also: India-US: ‘‘మోడీ ట్రంప్‌కు ఫోన్ చేయలేదు’’ వ్యాఖ్యలపై స్పందించిన భారత్..
సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమావేశం వర్చువల్ మోడ్‌లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలోని కీలక శాఖలకు సంబంధించిన ప్రజా సేవలు, డిజిటల్ గవర్నెన్స్, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం.. ఇప్పుడు పరిపాలనా యంత్రాంగాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, లక్ష్యాల సాధనపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారు. ఇటీవల పలు అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ స్థాయిలో క్రెడిట్ వార్ జరుగుతున్న తరుణంలో.. సీఎం నేరుగా అధికారులతో సమావేశం నిర్వహించడం, ప్రాధాన్య అంశాలపై పురోగతిని సమీక్షించడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ప్రభుత్వ నిర్ణయాల అమలులో వేగం పెంచడం, అలాగే 2026–27 నాటికి GSDP వృద్ధి లక్ష్యాలను చేరుకోవడమే ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర పరిపాలనలో సమన్వయం, వేగం, పారదర్శకత కీలకమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు.. ఈ భేటీ ద్వారా అధికార యంత్రాంగానికి మరోసారి స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
